Begin typing your search above and press return to search.

కేసీఆర్ పొలం బాట‌.. కాంగ్రెస్ విమ‌ర్శ‌ల తూటా!

ఈ క్రమంలో తొలి రోజు ఆయ‌న నల్గొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించి, ఎండిపోయిన పంటలను పరిశీలించారు.

By:  Tupaki Desk   |   31 March 2024 8:16 AM GMT
కేసీఆర్ పొలం బాట‌.. కాంగ్రెస్ విమ‌ర్శ‌ల తూటా!
X

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌.. దాదాపు నాలుగు నెల‌ల త‌ర్వాత ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న పార్టీని బ‌తికించుకునే ప‌నిని భుజాన వేసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఆయ‌న రైతుల‌ను క‌లుసుకోనున్నారు. ఈ క్రమంలో తొలి రోజు ఆయ‌న నల్గొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించి, ఎండిపోయిన పంటలను పరిశీలించారు.

రైతులను పరామర్శించి వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెబుతారని పార్టీ నేతలు తెలిపారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ జనగామకు చేరుకుని రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో కేసీఆర్ పర్యటించారు. రైతులకు సాగునీటి సమస్యలు, అకాల వర్షాలతో జరిగిన నష్టంపై అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు..

కేసీఆర్ పొలం బాట‌పై.. కాంగ్రెస్ విమర్శ‌ల తూటాలు పేల్చింది. రెండు సార్లు అధికారం ఇస్తే.. అప్పుడు క‌నిపించ‌ని రైతులు ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలోకి రాగానే క‌నిపించారా? అని విమ‌ర్శ‌లు సంధించింది.

+ ‘ఏ ముఖం పెట్టుకుని పొలం బాట పడుతున్నావ్ కేసీఆర్?’ అంటూ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో బీఆర్ఎస్ అధినేతను ప్రశ్నించింది.

+ నీ పాలనలో రైతులకు ఇచ్చిన మాట తప్పినందుకా? నువ్వు ఇస్తానన్న పంట నష్టం రూ. 10 వేలు ఇచ్చేందుకా? వడ్లు కొనుకుండా రైతుల ఉసురు తీసినందుకా? మద్దతు ధర కల్పించకుండా రైతులను అప్పుల పాలు చేసినందుకా? వరి వేస్తే ఉరే అని భయపెట్టినందుకా? అని కాంగ్రెస్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది.

+ అంతేకాదు, కాళేశ్వరం స్కాంలో నువ్వు తిన్న పైసలు రైతులకు పంచేందుకా? అని ప్రశ్నించింది.

+ గత పదేళ్లలో ఏనాడూ రైతుల కష్టాలు పట్టించుకోని నీకు ఇవాళ రైతులు గుర్తొచ్చారా? అయినా, నువ్వు కాలు పెట్టిన కాడల్లా నాశనమే. పచ్చని పొలాలు కూడా ఎండిపోతాయి. రావొద్దు కేసీఆర్. అని కాంగ్రెస్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.