Begin typing your search above and press return to search.

రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలంగాణ మంత్రి !

దేశంలో ఏ ఎన్నికలకు అయినా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇంత మొత్తమే ఖర్చు చేయాలని పరిమితి ఉంటుంది

By:  Tupaki Desk   |   26 April 2024 4:51 AM GMT
రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలంగాణ మంత్రి !
X

దేశంలో ఏ ఎన్నికలకు అయినా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇంత మొత్తమే ఖర్చు చేయాలని పరిమితి ఉంటుంది. ఆ మేరకు అభ్యర్థుల ప్రచార ఖర్చులను అంచనా వేసేందుకు ఎన్నికల సంఘం అధికారులను నియమిస్తుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు చేసిన ఖర్చులకు సంబంధించి బిల్లులు అందజేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం పరిమితికి మించి ఖర్చు పెడితే అనర్హత వేటు పడుతుంది. తాాజాగా తెలంగాణలో ఇటీవల శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఖర్చులపై మాట్లాడుతూ ఓ మంత్రి వీడియోతో సహా దొరికిపోాయాడు. మరి దేశవ్యాపితంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీద ఎలాంటి చర్యలు ఉంటాయా అని సర్వత్రా ఉత్కంఠ రేగుతున్నది.

తెలంగాణ ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు గత శాసనసభ ఎన్నికలలో తాను పంపిన డబ్బులకు, వచ్చిన ఓట్లకు తేడా ఉందని ప్రజలను బహిరంగంగా దబాయిస్తూ వీడియోకు చిక్కాడు. తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్ పరిధిలోని పెంట్లవెల్లి మండలకేంద్రంలో లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా జూపల్లి మాట్లాడుతూ ‘‘గత ఎన్నికలలో తాను కొల్లాపూర్, కోడేరు, చిన్నంబావి మండలాలకన్నా పెంట్లవెల్లి మండలానికి ఎక్కువ డబ్బులు పంపించానని, కానీ నాకు అక్కడ ఎక్కువ ఓట్లు వస్తే ఇక్కడ తక్కువ ఓట్లు వచ్చాయి. నేను పంపిన డబ్బులకు, వచ్చిన ఓట్లకు, చెబుతున్న ఖర్చులకు లెక్క సరిపోలడం లేదు. ఆయా మండలాలలో అందరు ప్రజాప్రతినిధులు ప్రత్యర్ధులే ఉన్నారు. అయినా ఎక్కువ ఓట్లు వచ్చాయి. మీరు చెబుతున్న ఖర్చులను నేను ఒప్పుకోను. లెక్క తేలాల్సిందే’’ అని నిలదీశారు.

అంతే కాకుండా అక్కడే ఉన్న తన పీఎ నిరంజన్ ను పిలిచి ‘గత ఎన్నికలలో పెంట్లవల్లికి ఎన్ని డబ్బులు పంపావు ? ఎవరెవరికి పంపావు ? లెక్క చెప్పి వివరాలు రాాబట్టాలని’’ ఆదేశించాడు. దీంతో బిత్తరపోయిన జనాలు, ప్రజా ప్రతినిధులు తమకు అన్ని డబ్బులు రాలేదని, ఇన్ని డబ్బులు రాలేదని మంత్రికి చెప్పడం వీడియోలో కనిపిస్తున్నది. బహిరంగంగా ఎన్నికల ఖర్చు వివరాలను బయటపెట్టిన మంత్రి మీద కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా ? ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా ? ఈ విషయాన్ని మంత్రి ఎలా సమర్దించుకుంటారో వేచిచూడాలి.