Begin typing your search above and press return to search.

ఒంగోలులో కారంపూడి సీఐ కొడుకు నిర్వాకం తెలిస్తే అవాక్కే

ఇంతకూ ఇలా చేసినోడు ఎవరేంటి? అని ఆరా తీస్తే కారంపూడి సీఐ కొడుకు శివశంకర్ అన్న విషయం వెలుగు చూసింది

By:  Tupaki Desk   |   18 March 2024 4:03 AM GMT
ఒంగోలులో కారంపూడి సీఐ కొడుకు నిర్వాకం తెలిస్తే అవాక్కే
X

బరితెగింపునకు పరాకాష్ఠగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. భారీ బందోబస్తు. పరీక్షలు ప్రశాంతంగా జరగటానికి.. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు భారీగా పోలీసులు.. అడుగడుగునా సునిశిత రీతిలో తనిఖీలు నిర్వహించి ఎగ్జామ్ హాల్ లోకి పంపిన తర్వాత.. పరీక్ష రాసే వ్యక్తి చేతిలో ఐఫోన్ ఉండటం.. ఎగ్జామ్ పేపర్ ను స్కాన్ చేస్తుండగా పట్టుకోవటం లాంటి ఘటనల గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఈ బరితెగింపు వ్యవహారం ఒంగోలు పట్టణంలో చోటు చేసుకుంది. ఇంతకూ ఇలా చేసినోడు ఎవరేంటి? అని ఆరా తీస్తే కారంపూడి సీఐ కొడుకు శివశంకర్ అన్న విషయం వెలుగు చూసింది.

ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షలు ఆదివారం జరిగాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రానికి పరీక్ష రాసేందుకు ప్రకాశం జిల్లా బేస్తవారపేటకు చెందిన తేళ్ల చిన మల్లయ్య కుమారుడు శివశంకర్ వచ్చాడు. ఇంతకూ ఇతగాడు ఎవరంటే.. కారంపేట సీఐ కొడుకు. తనిఖీల అనంతరం శివశంకర్ ను ఎగ్జామ్ హాల్లోకి పంపారు. పరీక్ష మొదలైన కాసేపటికి.. శివశంకర్ తన వద్ద ఉన్న ఐఫోన్ తో క్వశ్చన్ పేపర్ ను స్కాన్ చేసి బయటకు పంపుతున్న వైనాన్ని తోటి అభ్యర్థులు గుర్తించారు.

ఇదే విషయాన్ని ఈ ఎగ్జామ్ సెంటర్ లో పరీక్ష రాస్తున్న ఎస్ఐ ఒకరు అక్కడ పరీక్ష విధుల్ని నిర్వర్తిస్తున్న అధికారులకు తెలియజేశారు. దీంతో సమాచారం అందుకున్న సంయుక్త కలెక్టర్ గోపాలక్రిష్ణ.. నిందితుడు శివశంకర్ ను ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు పంపేశారు. అతడి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పోలీసులకు అప్పగించారు. ఐఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా విఫలమయ్యారు. పాస్ వర్డు చెప్పమంటే శివశంకర్ చెప్పకపోవటంతో అందులో ఏముందన్నది ఇప్పుడు ప్రశ్నగామారింది.

ఈ ఉదంతం ఉదయమే జరిగినా.. సాయంత్రం వరకు గుట్టుగా ఉంచటం.. శివశంకర్ చేత మొబైల్ ఓపెన్ చేయించలేకపోవటం హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం శివశంకర్ పరీక్షా పత్రాన్ని స్కాన్ చేసి షేర్ చేశారని చెబుతున్నారు. ఎవరికి షేర్ చేశారు? అతడి ఉద్దేశం ఏమిటన్న దానిపై సమాచారం బయటకు రావాల్సి ఉంది.