Begin typing your search above and press return to search.

60 అంటున్న ఈటల.. గేట్లు బద్దలు అంటున్న కోమటిరెడ్డి!

ఇదే సమయంలో... బీఆరెస్స్ నేతలే కాదు.. బీజేపీ నేతలు కూడా తమతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

By:  Tupaki Desk   |   30 March 2024 4:04 AM GMT
60 అంటున్న ఈటల.. గేట్లు బద్దలు అంటున్న కోమటిరెడ్డి!
X

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆరెస్స్ నేతలు వరుసపెట్టి కాంగ్రెస్ కు జైకొట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. కేశవరావు, కడియం శ్రీహరి వంటి నేతలు సైతం కారు దిగి వెళ్లిపోతుండటం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది! ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... ఈటల రాజేందర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి!

అవును... తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన పక్షం అయిన బీఆరెస్స్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కారు దిగి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల ముందు ఆ పార్టీకి ఇది పెద్ద దెబ్బని.. కోలుకోవడానికి సమయం పడుతుందని అంటున్నారు. అయితే... తన జీవితంలో ఇలాంటి దెబ్బలు ఎన్నో తిన్నారని.. ఇదేమీ కేసీఆర్ కు కొత్తకాదని.. తిరిగి కొత్త రక్తంతో పోటెత్తుతామన్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు.

మరోపక్క.. పోయినవారంతా చెత్త అని, తామే వేరేద్దామనుకునేలోపు, వాల్లే ఎగిరిపోయారన్నట్లుగా బీఆరెస్స్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీఆరెస్స్ పార్టీ నేతలు ఒక్కొక్కరు గా కారు దిగి హస్తం గూటికి చేరుతుండటం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు కొంతమంది... గతంలో కేసీఆర్ చేసిందేమిటి? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు!!

ఇదే సమయంలో... బీఆరెస్స్ నేతలే కాదు.. బీజేపీ నేతలు కూడా తమతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందులో భాగంగా... విపక్ష పార్టీల నేతలు తమ తమ పార్టీలతో విసుగెత్తి పోయారని చెబుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి... ఈ వలసల వరద ఇప్పట్లో ఆగదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఖాళీ అవుతున్నాయని తెలిపారు. అయితే... ఇది కేవలం బీఆరెస్స్ కు మాత్రమే ఉన్న సమస్య కాదని.. బీజేపీకి కూడా ఉందని తెలిపారు.

ఇందులో భాగంగా... తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ తాము గేట్లు ఎత్తలేదని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి... అయినప్పటికీ ఆయా పార్టీల నేతలే గేట్లు బద్దలుగొట్టి మరీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరుతున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... 12 మంది బీఆరెస్స్ ఎమ్మెల్యేలు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు!

దీంతో బీజేపీ నేత ఈటల రాజేంద్ర మైకందుకున్నారు. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని.. వారి సంఖ్య 8 వరకూ ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ తో బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది టచ్ లో ఉంటే.. 60 మంది కాంగ్రెస్ నేతలను తీసుకోవడం తమకు పెద్ద విషయం కాదని అన్నారు.

ఇదే క్రమంలో... కేసీఆర్ తరహాలోనే రేవంత్ సర్కార్ కూడా నేతలను కొంటోందని.. అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా హామీలను ఎందుకు అమలుపరచడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాలనపై దృష్టిపెట్టాలన్నట్లుగా తనదైన శైలిలో సూచించారు.