Begin typing your search above and press return to search.

తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా గెలిచే 10 సీట్లు ఇవేనట

దేశంలో తన ప్రాభవాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం వెలిగిపోతోంది.

By:  Tupaki Desk   |   19 April 2024 9:30 AM GMT
తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా గెలిచే 10 సీట్లు ఇవేనట
X

దేశంలో తన ప్రాభవాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం వెలిగిపోతోంది. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతోంది. దీనికి తోడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు గాలి వాటంగా వచ్చింది కాదన్న ప్రచారానికి తాజాగా జరుగుతున్న ఎంపీ ఎన్నికలతో స్పష్టం చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పక్కా ప్లానింగ్ కు లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతోంది తెలంగాణ అధికారపక్షం.

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో హైదరాబాద్ స్థానాన్ని పక్కన పెడితే.. మిగిలిన 16 స్థానాల్లో ఎవరివి ఎన్ని? అన్నదిప్పుడు చర్చగా మారింది. టార్గెట్ 14 పేరుతో రేవంత్ తమ గెలుపు మీద ధీమాను వ్యక్తం చేస్తున్నా.. అంత అవకాశం లేదని చెప్పాలి. మోడీ ప్రభ.. బీజేపీకి తెలంగాణలో పెరిగిన బలం నేపథ్యంలో టార్గెట్ 14కు రీచ్ కావటం అసాధ్యమని చెప్పాలి. అయితే.. గౌరవప్రదమైన స్థానాల్లో కాంగ్రెస్ తన సత్తా చాటుతుందని చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం 10 స్థానాల్లో విజయం ఖాయమని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే.. దాదాపు 70 స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది.

రాజకీయ వర్గాల అంచనా ప్రకారం పోటీ తీవ్రంగా ఉండే ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు అంత సులువు కాదంటున్నారు. ఆ ఆరు స్థానాల విషయానికి వస్తే.. సికింద్రాబాద్.. మల్కాజ్ గిరి.. చేవెళ్ల.. మహూబూబ్ నగర్.. కరీంనగర్ లో బీజేపీతో గట్టి పోటీ నెలకొని ఉంటే.. మెదక్ లో మాత్రం బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తోంది. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్కాగా గెలిచే సీటు ఏమైనా ఉందంటే.. అది మెదక్ అన్న మాట వినిపిస్తోంది. అయితే.. కాంగ్రెస్ నేతలంతా ఒకే తాటి మీద నిలబడి.. ప్రత్యేకంగా ఫోకస్ పెడితే మెదక్ కోటను బద్ధలు కొట్టటం కష్టం కాదంటున్నా.. వాస్తవ కోణంలో చూస్తే అదంత సులువు కాదంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు తాజా రిపోర్టు ప్రకారం.. ప్రత్యేకంగా ఫోకస్ చేసిన ఆరు నియోజకవర్గాలపై ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకోవలన్న సూచన చేసినట్లుగా తెలుస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై.. పోలింగ్ కు మరో మూడు వారాల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆయా సెగ్మంట్లలో ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసుకోవాల్సిన అవసరాన్ని తెలిపినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ కు కష్టతరంగా ఉన్న ఆరు స్థానాల్లో ఒకట్రెండు స్థానాల్లో విజయం సాధించినా అది బోనస్ అవుతుందంటున్నారు. ఈ ఆరు స్థానాల్లో సికింద్రాబాద్.. మెదక్.. మల్కాజ్ గిరి.. మహబూబ్ నగర్ ఎంపీ స్థానాల మీద ప్రత్యేక ఫోకస్ చేయగలిగితే.. కనీసం ఒకట్రెండు స్థానాల్లో గెలిచే వీలుందంటున్నారు. అదే జరిగితే.. రేవంత్ రెడ్డికి తిరుగు ఉండదంటున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో ఉన్న కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో ప్రచారంపై ఫోకస్ పెట్టిన రేవంత్.. గురువారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు.

ఈ రోజు (శుక్రవారం) నుంచి నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజైన ఏప్రిల్ 24 వరకు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రే స్వయంగా ఎంపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటే.. సానుకూల వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు. ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు వరుసగా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పలు సభల్లో పాల్గొని వంద రోజుల పాలనను ప్రజలకు వివరిస్తారని చెబుతున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు.. ఆరోపణలకు తీవ్రస్థాయిలో రియాక్టు కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఈ రోజు ఉదయం మహబూబ్ నగర్ .. సాయంత్రం మహబూబాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ పాల్గొంటారు. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి.. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ బరిలో ఉండటం తెలిసిందే.

రేవంత్ షెడ్యూల్ చూస్తే..

- ఏప్రిల్ 20 మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమం

- ఏప్రిల్ 21 భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ ప్రోగ్రాం

- ఏప్రిల్ 22 అదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమం

- ఏప్రిల్ 23న నాగర్ కర్నూలు అభ్యర్థి మల్లు రవి నామినేషన్

- ఏప్రిల్ 24 ఉదయం జహీరాబాద్ అభ్యర్థి సురేశ్ షెట్కార్.. మధ్యాహ్నాం వరంగల్ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ ప్రోగ్రాం.