Begin typing your search above and press return to search.

చంద్రయాన్‌-3 సక్సెస్ లో బాపట్ల అమ్మాయి... ఇదే హైలైట్!

ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని గర్వపడేలా చేసిన ఇస్రో చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో తెలుగు వారి భాగస్వామ్యం కీలకంగానే ఉంది

By:  Tupaki Desk   |   24 Aug 2023 8:28 AM GMT
చంద్రయాన్‌-3 సక్సెస్ లో బాపట్ల అమ్మాయి... ఇదే హైలైట్!
X

ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని గర్వపడేలా చేసిన ఇస్రో చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో తెలుగు వారి భాగస్వామ్యం కీలకంగానే ఉంది. ఇప్పటికే చంద్రయాన్‌-3లో మిషన్‌ డైరెక్టర్‌ గా పనిచేసిన శ్రీకాంత్‌ మోటమర్రి విశాఖ వాసి కాగా... బాపట్ల అమ్మాయి కూడా ఈ ప్రాజెక్టులో కీలకంగా ఉంది.

అవును... చంద్రయాన్ - 3 సక్సెస్ లో తెలుగమ్మాయి హస్తం కూడా ఉంది. ప్రతీ తెలుగు వాడూ గర్వ పడాల్సిన విషయం ఇది! బాపట్ల జిల్లా అమృతలూరు కు చెందిన యువ శాస్త్రవేత్త బొల్లు మానస... చంద్రయాన్ - 3లో కీలక భాగస్వామిగా ఉన్నారు. విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా జాబిల్లిపై దిగే సాఫ్ట్‌ వేర్‌ టెస్టింగ్‌ కీలక శాస్త్రవేత్తల బృందంలో ఆమె ఒకరు.

దీంతో తాజాగా మహిళా శక్తి తెరపైకి వచ్చింది. అవును ప్రతీ వ్యక్తి గర్వపడేలా.. మహిళలు సమానం అనేలా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను విజయవంతంగా దించిన ప్రాజెక్టులో తెలుగు వారికి, ప్రతిభావంతులైన యువతకు గర్వ కారణమయ్యారు మానస!

ఉద్యోగరీత్యా మానస తల్లిదండ్రులు వనజకుమారి, అనిల్‌ కుమార్‌ గుంటూరులో స్థిరపడగా... ఆమె కేరళలోని తిరువనంతపురం ఐఎస్‌టీ కళాశాలలో ఏవియానిక్స్‌ చదివారు. ఈ క్రమంలో అమ్మానాన్నల ప్రోత్సాహంతో శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి సేవ చేయాలని పట్టుదలతో కష్టపడి చదివారు.

అనంతరం 2014లో కోర్సు పూర్తయిన వెంటనే బెంగళూరు ఇస్రో శాటిలైట్ కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్టు సాఫ్ట్‌ వేర్‌ టెస్టింగ్‌ విభాగంలోనూ ఈమె శాస్త్రవేత్తగా సేవలందించారు. ఆమె తొలి కీలక ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అయినా ఆమె ఎక్కడా నిరుత్సాహపడలేదు.

అవును... 2019లో ల్యాండర్‌ చంద్రుడిపై దిగే సమయంలో అదుపు తప్పి కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రయాన్‌-3 ప్రాజెక్టును విజయవంతం చేసి దేశం, ఇస్రో ప్రతిష్ఠ పెంచాలని కలలు కన్న వారిలో తెలుగమ్మాయి మానస ఒకరు.

ఇందులో భాగంగా... నాలుగేళ్లు రాత్రింబవళ్లు శ్రమించారు. చంద్రయాన్‌-2లో జరిగిన తప్పులు గుర్తించి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై అడుగు పెట్టే సమయంలో శాస్త్రవేత్తల బృందంతో కలిసి పర్యవేక్షిస్తూ తీవ్ర ఉద్విగ్నతకు గురయ్యారు.

ఈ సందర్భంగా స్పందించిన మానస... చంద్రయాన్‌-3 విజయం ఇస్రో శాస్త్రవేత్తల ఉమ్మడి కృషి వల్లే సాధ్యమైందని తెలిపారు. ఈ విజయం చంద్రుడిపై మానవ సహిత యాత్రకు దోహదం చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో సూర్యుడిపైకి త్వరలో ప్రయోగిస్తున్న ఆదిత్య-ఎల్‌1 విజయవంతం కావడానికి సహచర శాస్త్రవేత్తలతో కలిసి శ్రమిస్తున్నట్లు మానస తెలిపారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా... తొలి దేశంగా భారత్‌ నిలిచి 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణంగా నిలవడంలో నా పాత్ర ఉన్నందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని మానస చెప్పారు. దీంతో... అదే స్థాయి గర్వం ప్రతీ తెలుగు వాడూ వ్యక్తపరుస్తున్నారు!