Begin typing your search above and press return to search.

అతడికి చంద్రబాబు సీటివ్వకపోవడానికి బీజేపీ పెద్దల ఒత్తిడే కారణమా?

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 March 2024 9:44 AM GMT
అతడికి చంద్రబాబు సీటివ్వకపోవడానికి బీజేపీ పెద్దల ఒత్తిడే కారణమా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు, బీజేపీ 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంటు, జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు 139 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అలాగే 13 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడించారు. ఇంకా నాలుగు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను మాత్రమే ప్రకటించాల్సి ఉంది.

చంద్రబాబు ప్రకటించాల్సిన నాలుగు పార్లమెంటు స్థానాల్లో రాజంపేట, అనంతపురం, ఒంగోలు, కడప ఉన్నాయి. అయితే ఒంగోలు లోక్‌ సభా స్థానం నుంచి అభ్యర్థి సిద్ధంగా ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రకటించకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

ప్రస్తుతం ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా చేరారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి తనకు బదులుగా తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు.

ఈ నేపథ్యంలో టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డికి సీటు ఖాయమనే అనుకున్నారు. అయితే ఈ సీటును చంద్రబాబు పెండింగులో పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒంగోలులో వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీ చేస్తున్నారు. చెవిరెడ్డికి మాగుంట అయితే గట్టి పోటీ ఇస్తారని భావించారు. అయితే చంద్రబాబు ఒంగోలు సీటును పెండింగులో పెట్టడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బీజేపీ ఢిల్లీ పెద్దలు మాగుంట రాఘవకు సీటు ఇవ్వవద్దని చంద్రబాబుకు సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట రాఘవ సైతం నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌ పై ఉన్నారు.

అంతేకాకుండా ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి రూ.30 కోట్ల ముడుపులను మాగుంట రాఘవ.. కేసీఆర్‌ కుమార్తె కవిత ద్వారా ఆమ్‌ ఆద్మీ పార్టీకి అందించినట్టు టాక్‌ నడుస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పిన బీజేపీ పెద్దలు.. మాగుంట రాఘవకు ఒంగోలు సీటు ఇవ్వవద్దని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఒంగోలు సీటును చంద్రబాబు పెండింగులో పెట్టారని అంటున్నారు.