Begin typing your search above and press return to search.

పోలీసుల అదుపుపై దుర్గారావు ఏం చెప్పారు?

గులకరాయి ఉదంతంలో అసలు తనకు సంబంధం లేనప్పుడు.. వారు చేయమన్నారని తాను ఎలా చెబుతానని గట్టిగా ప్రశ్నించానని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   22 April 2024 5:15 AM GMT
పోలీసుల అదుపుపై దుర్గారావు ఏం చెప్పారు?
X

గులకరాయి కేసులో అనుమానితుడిగా పోలీసుల అదుపులో నాలుగు రోజులు ఉండి.. రెండు రోజుల క్రితం విడుదలైన వేముల దుర్గారావు తాజాగా పెదవి విప్పారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకున్న వేళ.. అసలేం జరిగిందో వివరించారు. ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన దుర్గారావు సంచలన అంశాన్ని వెల్లడించారు. ఎవరి చెబితే గులకరాయి వేశారని ప్రశ్నించిన పోలీసులు.. అదే సమయంలో బొండా ఉమా పేరును పదే పదే ప్రస్తావించారని చెప్పారు. గులకరాయి ఉదంతంలో అసలు తనకు సంబంధం లేనప్పుడు.. వారు చేయమన్నారని తాను ఎలా చెబుతానని గట్టిగా ప్రశ్నించానని పేర్కొన్నారు.

ఈ సందర్భంలో పోలీసులు తనపై రెండు దెబ్బలు వేశారని చెప్పిన దుర్గారావు.. ‘‘చేయని నేరానికి నాలుగు రోజులు పోలీసుల కస్టడీలో ఉండాల్సి వచ్చింది. రోజుకు ఐదు గంటల పాటు నన్ను విచారించారు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి.. పోలీసులు నన్ను విడిచి పెట్టారు. నేను వారికి భయపడి ఉండి ఉంటే ఈపాటికి జైల్లో పెట్టేవారు’’ అంటూ పేర్కొన్నారు. తనను సింగ్ నగర్ లోని టీ షాపు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు తొలుత వన్ టౌన్ లోని సీసీఎస్ వద్దకు తీసుకెళ్లారని.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై రాయి ఎందుకు వేశామని ప్రశ్నించారన్నారు.

‘‘నువ్వే రాయి వేయించావటగా? అని గద్దించి అడిగారు. ఆ సమయంలో నేను అక్కడ లేను. నాకెలాంటి సంబంధమూ లేదు. నేనే చేయించానని చెప్పటానికి రుజువులు చూపాలని అడిగా. దీనికి పోలీసు అధికారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మర్యాదగా తప్పు అంగీకరిస్తే శిక్ష తగ్గే మార్గం చూస్తాం. లేదంటే నీ అంతు చూస్తామని బెదిరించారు.

చేయని నేరాన్ని అంగీకరించేది లేదని బలంగా నిలబడ్డా. నువ్వు ఒప్పుకోవాల్సిందేనన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యం తమ వద్ద ఉందని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఘటన జరిగినప్పుడు తాను ఘటనా స్థలంలో లేనని.. టీడీపీ కార్యాలయంలో ఉన్న విషయాన్ని వారికి వివరించారు. సీసీఎస్ నుంచి మైలవరం సర్కిల్ ఆఫీసుకు తీసుకొచ్చినప్పుడు ఎందుకు తెచ్చారంటే.. తెల్లవారుజామున పంపుతామని చెప్పారు. కానీ.. అక్కడ అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ సాగింది. రెండుసార్లు కొట్టారు. దీని కంటే మానసికంగా బాగా ఇబ్బంది పెట్టారు’’ అంటూ తనకు ఎదురైన అనుభవాల్ని వివరించారు.

తనను అదుపులోకి తీసుకున్న రోజు తెల్లవారుజామునే తమ కాలనీకి చెందిన సతీశ్ ను తాను ఉన్న పక్క గదిలో ఉంచారని చెప్పాడు దుర్గారావు. అతన్ని గది నుంచి తీసుకొచ్చి తన ముందు ఉంచి నిలబెట్టారంటూ.. ‘‘నేను చెప్పిన మీదటే రాయి వేసినట్లు చెప్పించారు. నేను నిన్న ఎప్పుడు కలిశాను. రాయి వేయమని ఎప్పుడు చెప్పానంటూ సతీశ్ ను అడిగాను. ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. అతగ్ని భయపెట్టి చెప్పించారని అర్థమైంది. మీరు నన్నెందుకు ఈ కేసులో ఇరికిస్తున్నారని పోలీసులతో వాదనకు దిగాను.

దాంతో వారికి కోపం వచ్చి నాపై రెండు దెబ్బలు వేశారు. నీ వెనుక ఎవరున్నారు.. వాళ్ల పేర్లు చెప్పు అంటూ వెనక్కి తోశారు. సతీశ్ మా కాలనీ వ్యక్తే. కాకుంటే నాకు పరిచయం లేదు. అదే విషయాన్ని చెప్పాను. బొండా ఉమా నీ వెనుక ఉన్నాడు కదా. నువ్వే చేయించావట కదా? అని పోలీసు అధికారులు అడిగారు.నేను చేయనప్పుడు ఎందుకు భయపడాలని అడిగా. గట్టిగా నిలిచా. నన్ను తెల్లవారుజామున సీఆర్పీసీ 160 నోలీసులు ఇచ్చి.. వాటిపై సంతకాలు చేయించుకొని ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు’’ అంటూ జరిగిన విషయాల్ని వివరంగా చెప్పుకొచ్చారు.