Begin typing your search above and press return to search.

బాలయ్యకు హిందూపురం...ఎంతెంత దూరం...?

నందమూరి బాలక్రిష్ణ ముచ్చటగా మూడవసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 April 2024 11:30 AM GMT
బాలయ్యకు హిందూపురం...ఎంతెంత దూరం...?
X

నందమూరి బాలక్రిష్ణ ముచ్చటగా మూడవసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. హిందూపురం కి మరో పేరు నందమూరిపురం అని. ఎందుకంటే ఇదే సీటు నుంచి అన్న నందమూరి తారక రామారావు 1985లో తొలిసారి పోటీ చేసి గెలిచారు ఆయన 1998లో మరోసారి గెలిచారు. 1994లో మూడవసారి గెలిచి 1996లో మరణించేటంతవరకూ కొనసాగారు. అంటే ఎన్టీయార్ పదకొండేళ్ల పాటు ఏకధాటిగా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కీలకమైన పాత్ర పోషించారు.

ఆయన మరణించాక అదే సీటు నుంచి ఆయన కుమారుడు నందమూరి హరిక్రిష్ణ హిందూపురం నుంచి 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు ఆయన 1999 దాకా దాదాపుగా మూడున్నరేళ్ల పాటు పనిచేశారు. ఇక 2014లో ఈ సీటు నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన నందమూరి బాలక్రిష్ణ పదహారు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో జగన్ వేవ్ లో ఆయన మెజారిటీ మరో వేయి పెరిగింది తప్ప తగ్గలేదు.

ఇపుడు చూస్తే 2024లో బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. బాలయ్యకు హిందూపురం సీటు ఏ విధంగా ఈసారి రాజకీయం చూపిస్తుంది అన్నది ఒక చర్చ. హిందూపురం గురించి చెప్పాలంటే 1983 తరువాత ఈ సీటుని టీడీపీ తప్ప మరో పార్టీ గెలిచింది లేదు. ఇప్పటికి తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే అన్ని సార్లూ టీడీపీ గెలిచిది. అందులో అన్నగారు ఎన్టీయార్ మూడు సార్లు హరిక్రిష్ణ ఒకసారి బాలయ్య రెండు సార్లు గెలిచారు. అంటే పాతికేళ్ల పాలన అంతా నందమూరి వారిదే అన్నది నిజం.

ఇపుడు కూడా బాలయ్యకే ఈ సీటు జై కొడుతోంది. బాలయ్యకు తిరుగులేదని చెబుతోంది. దానికి కారణం వైసీపీ బలంగా కనిపిస్తున్నా వర్గ పోరు ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన నవీన్ నిశ్చల్ కి 2019లో టికెట్ దక్కలేదు. 2019లో పోటీ చేసిన మహమ్మద్ ఇక్బాల్ తనకు ఈసారి సీటు ఇవ్వలేదని ఏకంగా ఎమ్మెల్సీ పదవికే రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు.

ఇక కొత్త అభ్యర్ధిగా దీపికను పోటీలోకి దించారు. ఆమె బీసీ సామాజిక వర్గం వర్కౌట్ అవుతుందని వైసీపీ వ్యూహం. అయితే వైసీపీ నేతలు ఆమె అభ్యర్ధిత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. దాంతో సొంత పార్టీలో ఆమెకు అండ దొరకని పరిస్థితి. ఇంకో వైపు చూస్తే నవీన్ నిశ్చల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనితో పాటుగా కీలక నేతలు అంతా కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు.

వైసీపీలో ఉన్న ఈ వర్గ పోరు బాలయ్య నెత్తిన పాలు పోస్తోంది అని అంటున్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ పక్కాగా గెలిచే సీటు ఇదే అని అంటున్నారు. ఈసారి బాలయ్య మెజారిటీ 17 వేలకు మించి ఉంటుందని భారీగా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీలో కొందరు నేతలు బాలయ్యకే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది.

వైసీపీ అభ్యర్ధిల ఎంపికలో ప్రతీ సారీ ప్రయోగాలు చేయడం అవి వికటించడం జరుగుతోంది అని అంటునారు. ఈ దెబ్బతో బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడతారు అని అంటున్నారు. హిందూపురం లో వైసీపీని గెలిపించే బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. కానీ ఆయన ఎన్నో పనులతో బిజీ అయ్యారు. వైసీపీలో కో ఆర్డినేషన్ లేకుండా పోయింది. అంతా తూతూ మంత్రంగా కధ సాగుతోంది.

మొత్తానికి చూస్తే నందమూరి అందగాడు బాలయ్య పొలిటికల్ హీరోనే అని హిందూపురం మరోసారి రుజువు చేస్తుందా అంటే పరిస్థితులు అవును అంటున్నాయి. ఈసారి కనుక బాలయ్య గెలిస్తే తన తండ్రి నందమూరి తారకరామారావు రికార్డు అయిన వరసగా మూడు సార్లు గెలవడాన్ని సమం చేస్తారు అని అంటున్నారు. అంతే కాదు హిందూపురం చరిత్రలో హ్యాట్రిక్ కొట్టిన అరుదైన రికార్డు నాడు అన్న గారికి నేడు బాలయ్య బాబుకే తప్ప ఎవరికీ లేదు అని కూడా అంటున్నారు. ఇప్పటిదాకా అక్కడ ఎవరూ వరసగా రెండు సార్లు కూడా గెలవలేదు అని హిందూపురం రాజకీయ చరిత్ర చెబుతోంది.