Begin typing your search above and press return to search.

వైసీపీ కాపు నేత రూటెటు?

2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరారు.

By:  Tupaki Desk   |   3 April 2024 8:30 AM GMT
వైసీపీ కాపు నేత రూటెటు?
X

ప్రకాశం జిల్లాలో కాపు సామాజికవర్గంలో కీలక నేత.. ఆమంచి కృష్ణమోహన్‌. ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శిష్యుడిగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపు బావుటా ఎగురవేశారు. ఏపీ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ (నవోదయం పార్టీ)గా పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత నాటి అధికార టీడీపీలో చేరారు.

2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరారు. ఆ సందర్భంగా టీడీపీలో కాపులకు ప్రాధాన్యత లేదని.. కాపులను అణగదొక్కుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులుతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజికవర్గాన్ని సమీకృతం చేసే ప్రయత్నం కూడా చేశారు.

అయితే విచిత్రంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గాలి ప్రభంజనంలా వీచినా చీరాల నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్‌ ఓడిపోయారు. నాటి నుంచి చీరాల వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరించారు.

అయితే నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఆధిపత్య పోరును ఎదుర్కొన్నారు. మరోవైపు చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం తదనంతర పరిణామాల్లో వైసీపీలో చేరారు. కరణం బలరాం కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత.

ఇక టీడీపీలోనే ఎమ్మెల్సీగా కొనసాగిన పోతుల సునీత కూడా గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. సునీత చేనేత సామాజికవర్గానికి చెందినవారు. చీరాలలో అత్యధిక సంఖ్యలో చేనేతలు ఉన్నారు. దీంతో అటు ఆమంచి కృష్ణమోహన్, ఇటు కరణం బలరాం, ఇంకోవైపు పోతుల సునీత.. ముగ్గురూ చీరాల నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోటీ పడటంతో ఆమంచిని వైసీపీ అధినేత జగన్‌ పర్చూరు ఇంచార్జిగా పంపారు.

చీరాల సీటును జగన్‌... సిట్టింగ్‌ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్‌ కు కేటాయించారు. సీటు కోసం పోటీపడ్డ పోతుల సునీతకు చేనేత విభాగం అధ్యక్ష పదవితోపాటు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. దీంతో ఆమె సర్దుకుపోయారు. పర్చూరుకు వెళ్లడం ఆమంచికి వెళ్లడం ఇష్టం లేకపోయినా వెళ్లారు. అయితే తరచూ చీరాల నియోజకవర్గంలో తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల కోసం ఇటీవల జగన్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆమంచి కృష్ణమోహన్‌ కు ఎక్కడా సీటు దక్కలేదు. ఆమంచి కృష్ణమోహన్‌ ఇంచార్జిగా పనిచేసిన పర్చూరుకు యడం బాలాజీని అభ్యర్థిగా ప్రకటించారు. చీరాలకు కరణం వెంకటేశ్‌ ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆమంచి ఎటూ కాకుండా పోయారు.

ప్రస్తుతానికి గుంభనంగా ఉన్న ఆమంచి తెర వెనుక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న కృష్ణమోహన్‌ వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ గా చీరాల నుంచి పోటీ చేయొచ్చని టాక్‌ నడుస్తోంది. అందులోనూ 2014లో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి గెలిచిన రికార్డు కూడా ఉండటంతో మరోసారి ఆమంచి కృష్ణమోహన్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారని చెబుతున్నారు.

దాదాపు అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్‌ వేరే పార్టీలో చేరినా సీటు అయితే దొరికే పరిస్థితి లేదు. మరి ఈ కాపు నేత చివరకు ఏ దారి ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.