Begin typing your search above and press return to search.

అక్కడ ఆమంచితనం పనిచేస్తుందా ?

కానీ అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పలుకుబడి కలిగిన వ్యక్తులు చేరితే కచ్చితంగా వారి ప్రభావం ఉంటుంది.

By:  Tupaki Desk   |   9 April 2024 12:46 PM GMT
అక్కడ ఆమంచితనం పనిచేస్తుందా ?
X

ఏపీలో కాంగ్రెస్ గెలుస్తుందా అంటే గెలవదు అనే చెప్పేవారు ఎక్కువ. ఎందుకంటే గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు లభించాయి. 2024లో కూడా అంతకంటే అద్భ్య్తాలు జరిగిపోవు అనే అంటారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పలుకుబడి కలిగిన వ్యక్తులు చేరితే కచ్చితంగా వారి ప్రభావం ఉంటుంది.

అలాంటి ఒక సీటు ఒక పలుకుబడి కలిగిన నేత గురించి ఇపుడు అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో చీరాల నుంచి పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ చూస్తున్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని మొదట అనుకున్నారు. కానీ ఇపుడు మనసు మార్చుకుని కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు.

ఆమంచి క్రిష్ణమోహన్ కి చీరాలలో కొంత పలుకుబడి ఉంది. ఆయన 2014లో నవోదయం పార్టీ పేరుతో అక్కడ నుంచి గెలిచారు. అప్పట్లో ఒక వైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉంటే మరో వైపు వైసీపీ హోరా హోరీ పోరు చేసినా ఆమంచికి చీరాల పట్టం కట్టింది. అదే చీరాలలో ఆయన 2019లో పోటీ చేస్తే ఓడించింది. టీడీపీకి చెందిన కరణం బలరాం పోటీ చేసి గెలిచారు

ఆయన కుమారుడికి ఇపుడు జగన్ టికెట్ ఇచ్చారు. దాంతో చీరాల మీద ఆశలు పెట్టుకున్న ఆమంచిని పర్చూరు వెళ్లమని అన్నారు. అయితే పర్చూరు నుంచి పోటీ చేసేందుకు ఇష్టం లేని ఆమంచి తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు.

ఆయన తాను టీడీపీ వైసీపీలతో గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నట్లుగా చెప్పారు. తనకు రెండు పార్టీలతో వ్యక్తిగతంగా భేదాలు లేవని అన్నారు వైసీపీలో తనకు బాగానే ఆదరించారని ఆయన చెప్పారు. కేవలం చీరాల నుంచి పోటీ చేయడం కోసమే తాను వైసీపీని వీడుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉంటే చీరాల రాజకీయ నేపధ్యం చూసినపుడు చీరాలలో టీడీపీకి పట్టు ఉంది. ఆ పార్టీ అనేక సార్లు అక్కడ గెలిచింది. ఇక కాంగ్రెస్ కూడా కొన్ని సార్లు గెలిచింది. వైసీపీ మాత్రం ఇప్పటిదాకా బోణి కొట్టలేకపోయింది. ఆ పార్టీ ఈసారి చీరాలలో జెండా ఎగరేయాలని చూస్తోంది. అందుకే కరణం ఫ్యామిలీకి టికెట్ ఇచ్చింది. కరణం వెంకటేష్ వైసీపీ నుంచి పోటీ చేస్తే టీడీపీ నుంచి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇపుడు ఆమంచి క్రిష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో రాజకీయ సమీకరణలు మారుతాయా అన్న చర్చ వస్తోంది.

ఆయనకు బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఆమంచితనం పనిచేస్తే కనుక చీరాల మీద కాంగ్రెస్ ఎంతో కొంత ఆశలు పెట్టుకోవచ్చు అని అంటున్నారు. అలా కాకుంటే ఓట్లు చీలి వైసీపీ అయినా లేక టీడీపీ అయినా గెలిచే అవకాశాలూన్నాయని అంటున్నారు. ఆమంచి తీసుకున్న ఈ నిర్ణయంతో చీరాల కూడా హాట్ ఫేవరేట్ సీటు గా మారుతోంది అని అంటున్నారు.