Begin typing your search above and press return to search.

ధర ఎక్కువైనా.. బోలెడు ప్రయోజనం.. ఈ కాలంలో తినాల్సిన డ్రై ఫ్రూట్

రోజూ కొన్ని పిస్తా పప్పులను తినడం వల్ల సాధారణ వ్యాధులైన జలుబు, దగ్గు నుంచి తప్పించుకోవచ్చనేది ఆరోగ్య నిపుణుల మాట.

By:  Tupaki Desk   |   31 Oct 2023 11:30 PM GMT
ధర ఎక్కువైనా.. బోలెడు ప్రయోజనం.. ఈ కాలంలో తినాల్సిన డ్రై ఫ్రూట్
X

ఇప్పుడంతా హైటెక్ కాలం.. శరీరానికి కావాల్సిన శక్తిని సహజంగా కాకుండా వివిధ రూపాల్లో పొందుతున్న కాలం.. ఇలాంటివే డ్రై ఫ్రూట్స్. అన్ని వయసుల వారికీ ఏదో ఒక డ్రై ఫ్రూట్ ను సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే, డ్రై ఫ్రూట్ లలో కాస్త ఖరీదైనది పిస్తా. బాదం పప్పులు, జీడిపప్పుల కంటే పిస్తా రేటు అధికమే. అందులోనూ బాదం, జీడి పప్పల్లా అవి అన్నిచోట్లా కూడా దొరకవు. కానీ, రుచి మాత్రం ఆ రెండింటి కంటే మెరుగే. అందుకే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు.

పోషకాలు మెండు..

డ్రై ఫ్రూట్ లలో రారాజుగా పేర్కొనే పిస్తాను రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయనేది నిపుణుల మాట. అందులోనూ చలికాలంలో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. పిస్తా అనేది వేడి స్వభావం కలిగినది.శీతాకాలంలో శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఎలాగూ ఆరోగ్యానికి ఉపయోగకరమైనదే కాబట్టి.. శీతాకాలపు సరైన చిరుతిండిగా పరిగణిస్తున్నారు.

సాధారణ వ్యాధులను అడ్డుకుంటుందట

రోజూ కొన్ని పిస్తా పప్పులను తినడం వల్ల సాధారణ వ్యాధులైన జలుబు, దగ్గు నుంచి తప్పించుకోవచ్చనేది ఆరోగ్య నిపుణుల మాట. ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ దండిగా ఉండే పిస్తా శక్తిని అందిస్తుంది. విటమిన్ ఇ దీని ద్వారా లభిస్తుంది. స్థితిస్థాపకతను పెంచుతూ చర్మాన్ని రక్షిస్తుంది. అంటే.. ముడతలు, గీతలను నివారిస్తుంది. అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది.. చర్మం పొడిబారకుండా.. తేమను కలిగి ఉండేలా చేస్తుంది. పిస్తాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంటే.. వ్యాధులను దరిచేరకుండా చూస్తుంది.

చెడు కొవ్వును తగ్గిస్తుందట..

పిస్తా శరీరంలోని చెడు కొవ్వు (కొలెస్ట్రాల్‌)ను తగ్గిస్తుందని.. మంచి కొవ్వును పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి కొలెస్ట్రాల్ గుండె పనితీరులో కీలకం. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడేందుకు పిస్తా సాయపడుతుందని వివరిస్తున్నారు. పిస్తాలు తినడం ద్వారా ఎక్కువసేపు ఆకలి కలగదు. ఎక్కువ తినకపోవడం ఊబకాయాన్ని నివారిస్తుంది. హైపర్‌ టెన్షన్, మధుమేహం, గుండె వ్యాధులు రావు. పిస్తాల్లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. బయోటిన్ జుట్టుకు చాలా మేలు. దీనిలోపం కారణంగానే జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారడం వంటి అనేక సమస్యలు వస్తాయి.