Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'టిల్లు స్క్వేర్'

రాధిక అనే అమ్మాయి చేతిలో గట్టి ఎదురు దెబ్బ తిన్నాక డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ).. టిల్లు ఈవెంట్స్ పేరుతో కంపెనీ పెట్టి వెడ్డింగ్ ఈవెంట్లు చేసుకుంటూ ఉంటాడు

By:  Tupaki Desk   |   29 March 2024 7:02 AM GMT
మూవీ రివ్యూ : టిల్లు స్క్వేర్
X

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్-ప్రిన్స్-మురళీధర్ గౌడ్-మురళీ శర్మ-అనీష్ కురువిల్లా తదితరులు

సంగీతం: రామ్ మిరియాల-అచ్చు రాజమణి

నేపథ్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు

రచన-సిద్ధు జొన్నలగడ్డ-రవి ఆంటోనీ

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ-సాయి సౌజన్య

దర్శకత్వం: మల్లిక్ రామ్

రెండేళ్ల కిందట సెన్సేషనల్ హిట్ అయిన 'డీజే టిల్లు'కు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం.. టిల్లు స్క్వేర్. దీని మీద అంచనాలు మామూలుగా లేవు. ఈ రోజే విడుదలైన 'టిల్లు స్క్వేర్' ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ: రాధిక అనే అమ్మాయి చేతిలో గట్టి ఎదురు దెబ్బ తిన్నాక డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ).. టిల్లు ఈవెంట్స్ పేరుతో కంపెనీ పెట్టి వెడ్డింగ్ ఈవెంట్లు చేసుకుంటూ ఉంటాడు. అలాంటి టైంలో అతడికి అనుకోకుండా ఒక పార్టీలో లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. ఒక్క రాత్రిలో ఇద్దరికీ సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ ఒక్కటవుతారు. ఉదయానికి లిల్లీ మాయమవతుంది. ఆమె కోసం టిల్లు వెతికి వెతికి అలసిపోయాక అనుకోకుండా ఓ ఆసుపత్రిలో కనిపించి తాను ప్రెగ్నెంట్ అంటుంది. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడి ఇద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటారు. ఇంతలో టిల్లు పుట్టిన రోజు వస్తుంది. ఆ రోజు లిల్లీని కలవడానికి వెళ్లి టిల్లుకు షాకుల మీద షాకులు తగులుతాయి. లిల్లీ అసలు స్వరూపం వేరని.. తనో మిషన్ కోసం తనను వాడుకుందని టిల్లుకు అర్థమవుతుంది. ఇంతకీ లిల్లీ ఎవరు.. తన మిషనేంటి.. అందుకోసం టిల్లు ఏం చేయాల్సి వచ్చింది.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: 'డీజే టిల్లు' అనే సినిమా ఒకటి తయారై ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్ని రోజుల ముందు వరకు పెద్దగా సౌండేమీ లేదు. కానీ ఆ సినిమా ట్రైలర్ బయటికి రాగానే.. ఈ క్యారెక్టరేదో భలే ఇంట్రెస్టింగ్ గా ఉందే అనిపించింది. ముఖ్యంగా టిపికల్ డైలాగ్ డెలివరీతో సిద్ధు జొన్నలగడ్డ ప్రోమోల్లో చెప్పిన డైలాగ్స్ యువ ప్రేక్షకులకు గట్టిగా తాకాయి. ఇక ఆ సినిమాలో టిల్లు పాత్రలో సిద్ధు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తమ గురించి ఎక్కువ బిల్డప్పులిచ్చుకుంటూ.. ఊరికే హడావుడి చేస్తూ.. తమ చుట్టూ ఉన్న వాళ్లను ఎంటర్టైన్ చేసే సిద్ధు తరహా కుర్రాళ్లు గల్లీ గల్లీలో కనిపిస్తారు. వాళ్లు అతిగా బిల్డప్పులిస్తారు కానీ.. ఎవరికీ హాని చేయరు. మన చుట్టూ కనిపించే ఇలాంటి కుర్రాళ్లకు ప్రతిరూపంలా అనిపించే టిల్లు పాత్రను సిద్ధు రచయితగా భలే గమ్మత్తుగా తీర్చిదిద్దడమే కాదు.. నటుడిగా ఆ పాత్రను పండించిన తీరు ప్రేక్షకులకు భలేగా నచ్చేసింది. రిలీజ్ తర్వాత నెలలు గడిచేకొద్దీ సోషల్ మీడియా పుణ్యమా అని కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది ఈ పాత్ర. ఇప్పుడు 'డీజే టిల్లు' కథను పొడిగిస్తూ తీసిన 'టిల్లు స్క్వేర్'లోనూ టిల్లు క్యారెక్టర్లో సిద్ధు చేసిన అల్లరే హైలైట్. ఫస్ట్ పార్ట్ లో మాదిరే కథ మామూలుగానే అనిపించినా.. ఏమాత్రం పదును తగ్గని వన్ లైనర్స్.. బోర్ కొట్టని కథనం.. అనుపమ గ్లామర్.. అన్నింటికీ మించి టిల్లు పాత్రలో సిద్ధు పెర్ఫామెన్స్ సినిమాను యువత మెచ్చే నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాయి. ఒక స్టయిల్లో సాగిపోయే వినోదం కొంచెం రిపిటీటివ్ గా అనిపించినా అదేమంత సమస్య కాదు.

ప్రేక్షకులకు బాగా అలవాటైన.. నచ్చిన పాత్రను కొనసాగిస్తూ సినిమా తీసినపుడు కొన్ని సానుకూలతలు ఉంటాయి. అలాగే కొన్ని ప్రతికూలతలూ ఉంటాయి. ఆ పాత్రను కొత్తగా పరిచయం చేసి.. ఎస్టాబ్లిష్ చేయాల్సిన పని లేదు. ప్రేక్షకులకు దాంతో ఒక కనెక్షన్ ఏర్పరచడానికి ప్రత్యేక కసరత్తూ అవసరం లేదు. ఆ పాత్రే సినిమాను డ్రైవ్ చేస్తుందనే భరోసా ఉన్నపుడు కథ గురించి కూడా మరీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సానుకూలతలన్నింటినీ 'టిల్లు స్క్వేర్' టీం ఉపయోగించుకుంది. డీజే టిల్లు పాత్ర జోష్ ఏమాత్రం తగ్గని విధంగా అదే స్టయిల్ వన్ లైనర్స్ తో సిద్ధు అండ్ టీం కావాల్సిన ఎంటర్టైన్మెంట్ డోస్ ఇచ్చేసింది. దీంతో సినిమా ఎక్కడా బ్రేకుల్లేకుండా సాగిపోయింది. టిపికల్ డైలాగ్ గెలివరీతో సాగే నాన్ స్టాప్ వన్ లైనర్స్ తో సిద్ధు ప్రేక్షకులను సినిమా అంతా వినోదాన్ని పంచుతూనే సాగాడు. ఐతే ఆల్రెడీ ఒక సినిమాలో చూశాం. ఇప్పుడు ఇంకో సినిమా. రెంటిలోనూ వినోదం ఒకే తరహాలో సాగడం.. సిద్ధు డైలాగుల మీదే భారమంతా పడిపోవడంతో ఒక దశ దాటాక చూస్తున్నదే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సిద్ధు ఏం మాట్లాడతాడో.. ఏం పంచ్ పేలుస్తాడో.. అతని రియాక్షన్ ఎలా ఉంటుందో ముందే అర్థమైపోతుంటుంది. కథ పరంగా కూడా ఏదీ కొత్తగా అనిపించదు. హీరోయిన్ పాత్ర ఎంట్రీ.. ఆ తర్వాత తన తీరు చూస్తేనే ఇదేదో తేడా వ్యవహారంలా ఉందని ప్రేక్షకులకు తెలిసిపోతుంది. దీంతో హీరో తాను మరోసారి మోసపోయానని తెలిసి షాకవుతుంటే.. దాని చుట్టూ వినోదం పండించాలని చూస్తుంటే అదేమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. కథలో ట్విస్టులకు లోటు లేదు కానీ.. అవేవీ మరీ పేలిపోయే రేంజిలో అయితే లేవు. కన్వీనియెంట్ గా ఏదో అలా నడిచిపోతాయంతే.

రెండుంబావు గంటల నిడవిలో 'టిల్లు స్క్వేర్' బోర్ కొట్టించిన సందర్బాలైతే చాలా తక్కువ. చాలా సాధారణంగా అనిపించే విషయాల మీద కూడా పంచ్ ఉన్న వన్ లైనర్ రాసి.. వాటిని టిపికల్ డైలాగ్ డెలివరీతో ప్రెజెంట్ చేయడంలోనే 'టిల్లు' పాత్ర బలమంతా దాగి ఉంది. పైల్స్ కంప్లైంట్ తో డాక్టర్ని కలిసిన తండ్రితో మాట్లాడుతూ.. ''మైదా పిండి మధ్యలో నీ పేగులున్నాయా.. పేగుల మధ్య మైదాపిండి ఉందా''.. ''ఒక పైప్ పెట్టి లోపల నీ మైదా ఉద్యమాన్ని 4కేలో చూపిస్తారు'' అనడం.. వంశం పౌరుషం అని ఇంకో సందర్భంలో మాట్లాడుతున్న తండ్రితో.. ''పెన్షన్ కోసం ఫేక్ సర్టిఫికెట్ రెడీ చేయించిన నువ్వా వంశం గురించి మాట్లాడుతున్నావ్'' అనడం.. ''ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుతున్నారో కానీ.. నన్ను మాత్రం ప్రతిసారీ ఇంపాక్ట్ ప్లేయర్ గా దించుతున్నారు''... ''ఈ హరాస్మెంట్ నేను భరించలేకున్నాను.. అర్జెంటుగా సిక్ లీవ్ అప్లై చెయ్యాలి. దయచేసి అప్రూవ్ చెయ్'' లాంటి ట్రెండీ వన్ లైనర్స్ ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వును చెరగనీయవు. ఓవైపు సిద్ధు పాత్ర కావాల్సినంత వినోదం పంచుతుంటే.. అనుపమ పాత్ర సైతం యూత్ మెచ్చేలా సాగడం.. పాటలు కూడా హుషారు పుట్టించడంతో 'టిల్లు స్క్వేర్' ప్రథమార్ధం రయ్యిన సాగిపోతుంది. ఇంటర్వెల్లో 'డీజే టిల్లు' కనెక్షన్ ఎంటర్టైన్మెంట్ డోస్ ను ఇంకా పెంచుతుంది. హీరోయిన్ పాత్రకు సంబంధించిన ట్విస్టు మాత్రం ఏమంత సర్ప్రైజింగ్ కాదు. మాఫియా డాన్ వ్యవహారం కూడా మామూలుగా అనిపిస్తుంది. కాకపోతే సిద్ధు మాత్రం తన ఎంటర్టైన్మెంట్ తను ఇస్తూనే ఉంటాడు. మధ్యలో రాధిక పాత్రలో నేహా ఎంట్రీ ఇచ్చి కాసేపు వినోదాన్ని పంచుతుంది. క్లైమాక్స్ కొంచెం మామూలుగానే అనిపిస్తుంది. అనుపమ పాత్రకు ఇచ్చిన ముగింపు ఓకే. తక్కువ నిడివి 'టిల్లు స్క్వేర్'కు పెద్ద ప్లస్. టిల్లు పాత్రకు ఆల్రెడీ బాగా కనెక్ట్ అయిన వాళ్లను 'టిల్లు స్క్వేర్' ఈజీగా టైంపాస్ చేయించేస్తుంది. అలవాటైన వినోదమే అయినా.. మరోసారి పేలింది ఇందులో.

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ మరోసారి టిల్లు పాత్రలో అల్లరల్లరి చేశాడు. తనతో పాటు ప్రేక్షకులకూ బాగా అలవాటైన పాత్రను అతను అలవోకగా చేసుకుపోయాడు. దీన్నొక కల్ట్ క్యారెక్టర్ గా మార్చేశాడతను. తన హావభావాలు.. డైలాగ్ డెలివరీ యువ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయి. టిల్లు పాత్రలో సిద్ధు లుక్ కూడా బాగుంది. తనకు కనెక్ట్ అయితే చాలు రెండుంబావు గంటలు సాఫీగా సాగిపోతాయి. అనుపమ పరమేశ్వరన్ పాత్ర ప్రోమోల్లో ఉన్నంత క్యూరియస్ గా అయితే సినిమాలో లేదు. ఆమె పాత్ర సోసోగా అనిపిస్తుంది. కానీ ఇప్పటిదాకా ఏ సినిమాలో లేనంత గ్లామరస్ గా కనిపించడమే కాదు.. లిప్ లాక్స్ మోత మోగిస్తూ కుర్రాళ్లకు కావాల్సినంత కిక్ ఇస్తుంది అనుపమ. రాధికగా నేహా శెట్టి కాసేపు రీఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంది. హీరో తండ్రి పాత్రలో మురళీధరన్ మరోసారి మంచి వినోదం పంచాడు. మాఫియా డాన్ క్యారెక్టర్లో మురళీ శర్మ.. పోలీస్ బాస్ పాత్రలో అనీష్ కురువిల్లా ఓకే అనిపించారు.

సాంకేతిక వర్గం: టిల్లు స్క్వేర్ మ్యూజిక్ మంచి హుషారు పుట్టిస్తుంది. 'డీజే టిల్లు' టైటిల్ సాంగ్ కొత్త లిరిక్స్ తో మరోసారి మెప్పించగా.. టిక్కెట్టే కొనకుండా కూడా మంచి ఊపునిచ్చే పాటే. మిగతా పాటలు కూడా ఓకే. భీమ్స్ సిసిరోలియో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే సాగింది. 'టిల్లు' థీమ్స్ నే వాడుకుంటూ అతను జోష్ నింపాడు. సాయిప్రకాష్ ఉమ్మడిసింగు కెమెరా పనితనం ఓకే. విజువల్స్ కలర్ ఫుల్ గా సాగాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సిద్ధు జొన్నలగడ్డ మరోసారి రైటింగ్ తోనే మార్కులు కొట్టేశాడు. అక్కడే సినిమా సగం సక్సెస్ అయిపోయింది. రవి ఆంటోనీతో కలిసి అతను అందించిన స్క్రిప్ట్ సింపుల్ గానే అనిపిస్తూ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. సిద్ధు మార్కు వన్ లైనర్స్ సినిమాకు మేజర్ హైలైట్. దర్శకుడు మల్లిక్ రామ్.. 'డీజే టిల్లు' ఫ్లేవర్ ను కొనసాగిస్తూ నీట్ గా సినిమా తీశాడు.

చివరగా: టిల్లు స్క్వేర్.. సౌండ్ తగ్గలేదు

రేటింగ్-2.75