Begin typing your search above and press return to search.

ది ఢిల్లీ ఫైల్స్.. వచ్చేది ఎప్పుడంటే..

రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   24 April 2024 3:32 PM GMT
ది ఢిల్లీ ఫైల్స్.. వచ్చేది ఎప్పుడంటే..
X

రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించిన హీరోయిన్ ఆదా శర్మ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈ సినిమా విషయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక వివాదాలు కూడా చెలరేగాయి.

అయితే ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించింది. ఈ సూపర్ హిట్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిందీ సంస్థ. ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో మరో మూవీ ది ఢిల్లీ ఫైల్స్ నిర్మించనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది.

కొన్ని రోజుల క్రితమే.. వివేక్‌ అగ్నిహోత్రి ది ఢిల్లీ ఫైల్స్ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఆ సినిమా ఉండకపోవచ్చని చాలా మంది అనుకున్నారు. ఇంతలో క్రేజీ అప్డేట్ ఇచ్చారు వివేక్ అగ్నిహోత్రి. షెడ్యూల్‌ ప్రకారం ది ఢిల్లీ ఫైల్స్‌ మూవీ ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. కచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ది ఢిల్లీ ఫైల్స్ సినిమాలో పెద్ద స్టార్స్‌ ఎవరూ ఉండరని, కంటెంట్‌ మాత్రమే పెద్ద అని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. "కొన్నేళ్ల నుంచి ఎవరూ చెప్పలేని కథలను కళ్లకు కట్టినట్లు చూపించడం ప్రారంభించాను. వాటిలో ఫస్ట్ ది తాష్కంట్‌ ఫైల్స్‌.. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండోది ది కశ్మీర్‌ ఫైల్స్‌ ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు మూడో సినిమా ది ఢిల్లీ ఫైల్స్‌ ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

ది ఢిల్లీ ఫైల్స్ మూవీని అభిషేక్ అగర్వాల్ సహా పలువురు నిర్మించనుండగా.. తేజ్ నారాయణ్ సమర్పించనున్నారు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి పర్వ సినిమాతో బిజీగా ఉన్నారు. మహాభారతం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మూడు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నట్లు వివేక్ ఇప్పటికే చెప్పారు.