Begin typing your search above and press return to search.

'రత్నం' మూవీ రివ్యూ

By:  Tupaki Desk   |   26 April 2024 10:20 AM GMT
రత్నం మూవీ రివ్యూ
X

'రత్నం' మూవీ రివ్యూ

నటీనటులు: విశాల్-ప్రియా భవాని శంకర్-సముద్రఖని-మురళీ శర్మ-యోగి బాబు-విజయ్ కుమార్-జయప్రకాష్-తులసి తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం: సుకుమారన్

నిర్మాత: కార్తికేయన్ సంతానం

రచన-దర్శకత్వం: హరి

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్. దర్శకుడు హరి కూడా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కలయికలో ఇప్పటికే భరణి.. పూజ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు విశాల్-హరి కలిసి చేసిన మరో మాస్ మూవీ.. రత్నం. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: రత్నం (విశాల్) ఓ అనాథ. అతను తమిళనాడు బోర్డర్ లో ఉండే చిత్తూరులో ఎమ్మెల్యే (సముద్రఖని)కి కుడి భుజంగా ఉంటూ సెటిల్మెంట్లు చేస్తుంటాడు. అతడికి అనుకోకుండా మల్లిక (ప్రియా భవాని శంకర్)తో పరిచయం అవుతుంది. ముందు రత్నంను అపార్థం చేసుకున్న మల్లిక.. తర్వాత తన గురించి తెలిసి అభిమానిస్తుంది. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు చంపాలని ప్రయత్నిస్తుంటే.. రత్నం అండగా నిలుస్తాడు. ఒకదాని తర్వాత ఒకటి ఆమె మీద ఎటాక్స్ జరుగుతూనే ఉంటాయి. దీని వెనుక ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో ఉండే స్థలాలను కబ్జా చేస్తూ తిరుగులేని స్థాయికి ఎదిగిన లింగం (మురళీ శర్మ) ఉన్నాడని తర్వాత తెలుస్తుంది. ఇంతకీ లింగం.. మల్లిక మీద ఎందుకు కక్షగట్టాడు.. అతడి నుంచి మల్లికను రత్నం కాపాడుకున్నాడా లేదా... మల్లిక మీద రత్నం అంత అభిమానం చూపించడానికి కారణమేంటి.. అన్నది తెర మీదే చూడాలి.

కథనం-విశ్లేషణ: విశాల్ అంటేనే మాస్. భారీ యాక్షన్ సీక్వెన్సులకు అతను పెట్టింది పేరు. ఫైట్లు లేని అతడి సినిమా ఉండదు. ఇక దర్శకుడు హరిది కూడా మాస్ బాటే. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే ఫైట్ల మోత మోగిపోవడం ఖాయం అని ప్రేక్షకులకు అంచనా ఉంటుంది. 'రత్నం'లో కూడా బోలెడన్ని ఫైట్లున్నాయి. ఆ ఫైట్లు ఏ నేపథ్యంలో సాగుతాయో ఓసారి చూద్దాం. ముందుగా తొలి ఫైట్ విషయానికి వ్తే.. హీరోయిన్ కాలేజీలో ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటుంది. ఆమె మీద ఒక గ్యాంగ్ ఎటాక్ చేస్తుంది. హీరో ఫైట్ చేసి కాపాడతాడు. ఆ తర్వాత హీరోయిన్ బస్సులో ఊరెళ్తుంటుంది. మధ్యలో ఒక గ్యాంగ్ ఎటాక్ చేయబోతే.. మళ్లీ సరిగ్గా అదే టైంకి హీరో ఎంట్రీ ఇచ్చి ఫైట్ చేసి ఆమెను రక్షిస్తాడు. ఇది రెండో ఫైట్. ఇక మూడోసారేమో హీరోయిన్ ఇంటి మీదికే రౌడీలు దండెత్తి వస్తారు. మళ్లీ హీరో రంగంలోకి దిగి ఓ పాతిక శవాల దాకా లేపుతాడు. నాలుగో ఫైట్ హీరోయిన్ ఇంటి వెనుక ఉండే పచ్చిక బయళ్లలో అన్నమాట. ఈసారి రొటీన్‌గా కాకుండా ఏవో వేషాలేసుకుని వస్తుంది రౌడీ బ్యాచ్. మళ్లీ హీరోయిన్ మీద కత్తి వేటు పడబోతుంటే.. సరైన టైమింగ్‌ లో హీరో ఎంట్రీ ఇచ్చి అందరినీ లేపేస్తాడు. ఇక ఐదో ఫైటేమో హీరోయిన్ మెడిసిన్ సీటులో అడ్మిషన్ తీసుకుంటే.. అక్కడ్నుంచి మొదలై హైవే మీదికి వస్తుంది. హీరో ఎప్పట్లాగే వీర విధ్వంసం సృష్టిస్తాడు. ఇదేంటి.. ఒక్క సినిమాలో హీరోయిన్ మీద ఇన్ని ఎటాక్స్.. హీరో ఆమెను రక్షిస్తూ ఇన్ని ఫైట్లా అంటే.. మాస్ సినిమా అంటే అంతే అని సర్దుకుపోవాలి.

సింగం సిరీస్ తో మాస్ సినిమాలకు కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు హరి. మాస్ సినిమాలంటే హీరోయిజం ఎలివేట్ చేయడం.. యాక్షన్ మోత మోగించడమే కాదు.. కథల్లో కూడా విషయం ఉంటుందని రుజువు చేస్తూ పవర్ ఫుల్ సినిమాలు అందించిన హరి.. కొన్నేళ్ల నుంచి రొడ్డు కొట్టుడు సినిమాలతో లాగించేస్తున్నాడు. ఇప్పుడు ఆయన్నుంచి వచ్చిన పరమ రొటీన్ మాస్ సినిమా.. రత్నం. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చుట్టూరా రెండున్నర గంటల పాటు తిప్పి తిప్పి అవే సీన్లు చూపిస్తూ మాస్ సినిమాలంటే పడిచచ్చే ప్రేక్షకులతో కూడా దండం పెట్టించేస్తాడు హరి. ఇంత సిల్లీ కథతో ఒక స్టార్ హీరో.. పెద్ద కాస్టింగ్ పెట్టుకుని పెద్ద బడ్జెట్లో సినిమా తీయడం హరికే చెల్లింది. మొదట్లో పాత్రల పరిచయం వరకు పర్వాలేదనిపించే సినిమా.. ఆ తర్వాత హీరోయిన్ మీద తొలి ఎటాక్ జరిగిన దగ్గర్నుంచి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. రౌడీలు ఎటాక్ చేయడం.. హీరో కాపాడ్డం.. సినిమా అంతా ఇదే వరస. ఫైటు ఫైటుకీ హీరో చేతిలో ఆయుధాలు మారుతుంటాయి కానీ.. అతను సృష్టించే విధ్వంసం మాత్రం కామన్. యాక్షన్ కొరియోగ్రాఫర్లు తమ క్రియేటివిటీ అంతా చూపిస్తూ హీరోతో రకరకాల విన్యాసాలు చేయించారు కానీ.. ప్రేక్షకులకు మాత్రం పోను పోను ఆ సీక్వెన్సులు చిత్ర హింసలా తయారవుతాయి.

ఈ రొటీన్ ఫైట్లే భరించలేని విధంగా ఉంటే.. ఓవైపు హీరోయిన్ హీరోతో ప్రేమలో పడిపోయి ఊహల్లో తేలియాడుతుంటే.. అతనేమో ఆమెలో తల్లి పోలికలు చూసుకుని ఆమెను అమ్మలా ఆరాధించడం.. దీని మీద ఎమోషన్ రన్ చేయడం ఇంకా పెద్ద హింస. హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటి ట్రాక్ పెట్టాలని హరికి ఎలా అనిపించిందో? సంబంధిత సన్నివేశాలకు ఎలా రియాక్టవ్వాలో కూడా ప్రేక్షకులకు అర్థం కాని పరిస్థితి. ఇక కనిపించిన ప్రతిసారీ ఒళ్లంతా పౌడర్ రాసుకుంటూ కనిపించే విలన్ పాత్రలో మురళీ శర్మది ఇంకో రకమైన టార్చర్. ఇలా సినిమా నిండా చిత్ర విచిత్రమైన క్యారెక్టర్లు.. భరించలేని సన్నివేశాలతో 'రత్నం' ప్రేక్షకులకు చుక్కలు చూపించేస్తుంది. మాస్ పేరుతో ఏం రాసినా.. ఏం తీసినా చెల్లిపోతుందనే భ్రమలో హరి అండ్ కో ఒక అర్థరహితమైన సినిమాను ప్రేక్షకులకు వడ్డించింది. మాస్ సినిమాలంటే వెర్రెత్తిపోయే ప్రేక్షకులు కూడా 'రత్నం'ను భరించడం చాలా చాలా కష్టం.

నటీనటులు: విశాల్ తన సినిమాల్లో ఎప్పుడూ చేసేదే చేశాడు. సినిమా నిండా ఫైట్లే ఫైట్లు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోకుండా ఇంకా ఎన్ని రోజులు ఇవే ఫైట్లు చేసుకుంటూ విశాల్ ఇంకా ఇలా ఎన్ని రొటీన్ సినిమాలు వదులుతాడో అర్థం కాదు. నటన పరంగా ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ మాత్రం బాగా నటించింది. కానీ ఆమెను హీరోయిన్ లా కాకుండా మరీ మామూలు అమ్మాయిలా చూపించడం తనను ఇష్టపడే వారికి రుచించకపోవచ్చు. పాత్రకు తగ్గట్లు కొలిచినట్లు నటించే మురళీ శర్మ ఈ చిత్రంలో విపరీతమైన ఓవరాక్షన్ చేశాడు. అదంతా దర్శకుడి అభిరుచి మేరకే కావచ్చు. తులసి.. విజయ్ కుమార్ లాంటి నటులు చేసిన అతిని కూడా భరించలేం. యోగిబాబు.. మొట్ట రాజేంద్రన్ బేసిగ్గా కమెడియన్లు కాబట్టి వాళ్లు చేసింది కామెడీ అనుకుని నవ్వుకోవాలి. అంతే తప్ప చక్కిలిగింతలు పెట్టినా కూడా నవ్వు రాదు.

సాంకేతిక వర్గం: దేవిశ్రీ ప్రసాద్ ఒకప్పుడు సినిమా ఎలా ఉన్నా తన వరకు పాటలతో అదరగొట్టేవాడు. కానీ కొన్నేళ్ల నుంచి పిండి కొద్దీ రొట్టె అన్నట్లు పని చేస్తున్నాడు. 'రత్నం' సినిమాలో పాటలు సినిమాకు తగ్గట్లే చాలా మొక్కుబడిగా సాగాయి. నేపథ్య సంగీతంలో కూడా విశేషమేమీ లేదు. సగటు మాస్ సినిమాలో వినిపించే సౌండ్లే ఇందులోనూ వింటాం. సుకుమారన్ ఛాయాగ్రహణం ఓకే. హరి సినిమాల్లో ఎప్పడూ చూసే విజువల్సే కనిపిస్తాయి. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. బాగానే ఖర్చు పెట్టారు. కానీ దర్శకుడు హరినే కేవలం యాక్షన్ సీక్వెన్సులనే నమ్ముకుని సినిమాను లాగించేశాడు. కనీసం ఆ యాక్షన్ ఘట్టాలకు భిన్నమైన నేపథ్యాలు కూడా సెట్ చేయకుండా.. ఒకే టెంప్లేట్లో లాగించేశాడు. హరి కెరీర్లో అట్టడుగున నిలిచే సినిమాల్లో 'రత్నం' ఉంటుంది.

చివరగా: రత్నం.. మాస్ కాదు తుస్

రేటింగ్-1.75/5