Begin typing your search above and press return to search.

ర‌ణ‌బీర్‌కి మోకాల‌డ్డుతున్న‌ ప్ర‌భాస్

తాజా స‌మాచారం మేర‌కు ప్ర‌ఖ్యాత హిందీ మీడియాలో ప్ర‌భాస్ తో స్పిరిట్‌ను ముగించిన తర్వాత సందీప్ రెడ్డి వంగా 2026లో 'యానిమల్ పార్క్' షూటింగ్‌ను ప్రారంభిస్తార‌ని టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   29 March 2024 3:15 AM GMT
ర‌ణ‌బీర్‌కి మోకాల‌డ్డుతున్న‌ ప్ర‌భాస్
X

ర‌ణ‌బీర్ క‌పూర్ 'యానిమ‌ల్'తో బంప‌ర్ హిట్ కొట్టాడు. తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా అత‌డి కెరీర్ కి పెద్ద బూస్ట్ ని ఇచ్చాడు. ఈ సినిమాకి సీక్వెల్ యానిమ‌ల్ పార్క్ తెర‌కెక్కుతుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. దీంతో ర‌ణ‌బీర్ అభిమానులు, సినీ ప్రేమికులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 'యానిమల్' క్లైమాక్స్ లో సీక్వెల్ గురించి మేక‌ర్స్ స్ప‌ష్ఠంగా ప్ర‌క‌టించ‌డంతో ఫ్యాన్స్ దాని గురించే ఆలోచిస్తున్నారు. అయితే యానిమల్ పార్క్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి క్లారిటీ లేదు. 2025లో ప్రారంభం కావచ్చని కొంద‌రు వ్యాఖ్యానిస్తుండ‌గా, అది ఇప్పుడిప్పుడే కుద‌ర‌ద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

రణబీర్ కపూర్ దృష్టి ప్రస్తుతం నితేష్ తివారీ 'రామాయణం'పై ఉన్నందున యానిమ‌ల్ పార్క్ హోల్డ్‌లో ఉందని కొన్ని క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. కానీ అందుకు విరుద్ధ‌మైన క‌థ‌నం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2023లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 900 కోట్లు కొల్ల‌గొట్టిన యానిమ‌ల్ సీక్వెల్ తీయాలంటే ముందుగా ప్ర‌భాస్ తో సందీప్ వంగా 'స్పిరిట్' పూర్త‌వ్వాల‌ని చెబుతున్నారు. స్పిరిట్ పూర్తి చేసేవ‌ర‌కూ సందీప్ వంగాకు కుద‌ర‌దు. కానీ ఈ భారీ క్రేజీ చిత్రం పూర్త‌వాలంటే ఏడాదిన్న‌ర పైగానే ప‌డుతుంద‌ని అంచనా.. అలాంట‌ప్పుడు యానిమ‌ల్ క్రేజ్ ని అప్ప‌టివ‌ర‌కూ నిల‌బెట్ట‌డం సులువు కాదు! రణబీర్ కపూర్ సినిమా విధి ప్రభాస్ న‌టించే కొత్త చిత్రం 'స్పిరిట్‌'పై ఆధారపడి ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ 'స్పిరిట్' కోసం స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. ఇందులో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ 25వ చిత్రంగా రికార్డుల‌కెక్కనుంది. యానిమల్ ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ ఇటీవ‌ల మాట్లాడుతూ.. స్పిరిట్ యానిమల్ కంటే చాలా గొప్పగా ఉంటుందని ఇప్పటికే సూచించాడు. దీంతో ప్ర‌భాస్ అభిమానుల్లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది.

తాజా స‌మాచారం మేర‌కు ప్ర‌ఖ్యాత హిందీ మీడియాలో ప్ర‌భాస్ తో స్పిరిట్‌ను ముగించిన తర్వాత సందీప్ రెడ్డి వంగా 2026లో 'యానిమల్ పార్క్' షూటింగ్‌ను ప్రారంభిస్తార‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌భాస్ సినిమా పూర్త‌య్యాకే కపూర్ కి అవ‌కాశం ఉంటుంది. అప్ప‌టివ‌ర‌కూ ఈ ప్రాజెక్ట్ గురించి సందీప్ వంగా ఏదీ మాట్లాడ‌డు అని తెలిసింది. దీనర్థం ప్రభాస్ నటించ‌నున్న‌ స్పిరిట్ ప్ర‌భావం 'యానిమల్ పార్క్‌'పై నేరుగా ప‌డే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ క‌థ‌నాల‌పై సందీప్ రెడ్డి వంగా లేదా అతడి బృందం నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కానీ రణబీర్ కపూర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ యానిమ‌ల్ పార్క్ కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతానికి వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లే వార్త‌లే వ‌స్తున్నాయి. వారికి సంతృప్తి క‌లిగే స‌మాధానం సందీప్ వంగా ఇవ్వాల్సి ఉంది. ప్రభాస్ సినిమా పూర్తయ్యే వరకు, యానిమల్ పార్క్ పై అప్ డేట్ వస్తుందనే ఆశ ఇప్పుడు లేనే లేదు.