సముద్ర అలలపై బైక్ తో సర్ఫింగ్

Thu Aug 06 2015 11:15:00 GMT+0530 (IST)

రాకాసి అలల్ని.. బొమ్మాట ఆడుకునే సర్ఫింగ్ క్రీడాకారుల్ని చూస్తే మతి పోవాల్సిందే. విరుచుకుపడే అలల మీద దూసుకెళుతూ.. అలల అంతు చూసే సర్ఫింగ్ క్రీడ చూసే వారికే బోలెడంత థ్రిల్ ఇచ్చేస్తుంది.

అలాంటి సర్ఫింగ్ క్రీడకు సరికొత్త ట్రెండ్ సృష్టించాడు ఆస్ట్రేలియాకు చెందిన రోబీ మాడిసన్. సాహసం చేయటమే తన జన్మహక్కు అన్నట్లుగా వ్యవహరించే అతగాడు.. సముద్రాన్ని తన ఆటస్థలంగా చేసుకున్నాడు. అలలపై ఆడుకునే అతగాడి సర్ఫింగ్ ఓ లెక్కే కాదు. శంకర్ ఐ సినిమాలో కనుక.. ‘‘అంతకు మించి’’ అన్నట్లు.. సర్ఫింగ్ కు మించి.. సముద్ర అలలపై ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించిన ఇతగాడు ఎవరూ ఊహించని ఒక సాహసకార్యానికి తెర తీశాడు.

సర్ఫింగ్ ప్యాడ్ల స్థానంలో ఒక బైక్ ను ప్రత్యేకంగా తయారుచేసి.. దాంతో దూసుకెళితే ఎలా ఉంటుందని ఆలోచించి.. దానికి తగ్గట్లే తన బైక్ ను సిద్ధం చేసుకున్నాడు. ఇందుకోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాడు. చివరకు సముద్రంపై సర్ఫింగ్ చేసేందుకు వీలైన బైక్ ను సిద్ధం చేసుకున్నాడు.

అనంతరం వేగంగా దూసుకొచ్చి.. సముద్రంలోకి దూసుకెళ్లిన అతగాడు.. భారీ అలలపై బైక్ తో విన్యాసాలు చేయసాగాడు. అతని గురించి తెలిసినప్పటికీ.. అతగాడి సర్ఫింగ్  సాహసాన్ని చూసిన అక్కడి వారు అవాక్కు అయ్యాడు. తన సాహస క్రీడను వీడియోగా తీసి.. దాన్ని యూ ట్యూబ్ లో పోస్ట్ చేశారు. సోషల్ వెబ్ సైట్ల పుణ్యమా అని సదరు వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాహసానికే సాహసంగా ఉన్న ఈ బైక్ సర్ఫింగ్ వీడియోను చూసేందుకు రెండు కళ్లు కూడా చాలని పరిస్థితి.