Begin typing your search above and press return to search.

డిజిటల్ యుగంలో.. అద్దెకు కోళ్లు

By:  Tupaki Desk   |   23 July 2015 4:28 AM GMT
డిజిటల్ యుగంలో.. అద్దెకు కోళ్లు
X
వాటిని వీటిని అద్దెకు ఇవ్వటం చూశాం. ఇప్పుడు కోళ్లను కూడా అద్దెకు ఇచ్చేస్తున్నారు. అద్దెకు కోళ్లను తీసుకునే క్రేజ్ అమెరికాలోని పిట్స్ బర్గ్ లోని పెన్సిల్వేనియాలో ఎక్కువైంది. ఎందుకిలా అంటే.. కోడిగుడ్డు ప్రేమికుల కోసం అని చెబుతున్నారు. ఒక పద్ధతి పాడు లేకుండా పెరిగిపోతున్న కోడిగుడ్డు రేట్ల కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి సౌలభ్యంగా ఉండేందుకు ఈ వినూత్న ఆలోచన చేశారు.

అద్దెకు ఇచ్చేది కోడినే అయినా.. దానికి పెద్ద ప్రొసీజరే ఉందండోయ్. కోడితో పాటు.. కోడి గూడును అద్దెకు ఇస్తారు. అద్దెకు తీసుకోవాలని భావించేవారు మినిమం నాలుగు నెలల వరకూ తీసుకోవాలి. మ్యాగ్జిమం ఆర్నెల్ల వరకూ ఇస్తారు. అద్దెకు కోడిని ఇచ్చేందుకు ఒప్పంద పత్రం (అగ్రిమెంట్) చేసుకోవాలి. రెంటల్ అగ్రిమెంట్ లో పేర్కొన్న విధంగా.. టైం అయిపోయిన వెంటనే తిరిగి కోడిని ఇచ్చేయాలి. ఒకవేళ.. కోడి మీద మనసు పెరిగితే.. దాన్ని యజమాని అడిగిన ధర చెల్లించి సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది.

గతంలోనూ ఇలాంటి బిజినెస్ ఉన్నా.. పెద్దగా ఆదరణ ఉండేది కాదంట. కానీ.. ఈ మధ్య కాలంలో కోడిగుడ్డు ధర ఇట్టే పెరగటం.. తగ్గటం లాంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయట. అందుకే..ఈ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోందట.అద్దెకు అంటే ఏమో అనుకునోరు? అమెరికాలో కోళ్ల అద్దెలు కూడా కాస్తంత ఖరీదైనవే. గతంలో ఈ అద్దె ఏడాదికి 400 డాలర్లు (రూ.2400) ఉండేదట.. ఈ ఏడాది 600 అమెరికా డాలర్లకు (రూ.3600) పెంచేశారు. గుడ్డుకు పెరుగుతున్న గిరాకీతో అద్దెకు కోళ్ల వ్యవహారం మా గొప్ప జోరుగా సాగుతోందట. ఇలా అద్దెకు ఇచ్చే కోళ్లు వారానికి ఒక్కో కోడి 8 నుంచి 14 కోడిగుడ్లను పొదుగుతుందట. ఈ వ్యాపారం ఏదో బాగుంది కదూ..?