నచ్చిన పేర్లు పెట్టే స్వేచ్ఛ కూడా లేదక్కడ

Tue Jul 28 2015 12:15:51 GMT+0530 (IST)

పాత రోజులు వేరు. పిల్లలకు పేర్లు పెట్టాలంటే అప్పటి ప్రాధాన్యతలు వేరు.. అప్పటి భావోద్వేగాలు వేరు. ఇప్పటి తరం ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. గతంలో పెట్టే పేరు వారి ప్రాంతానికి.. వారి సమూహాన్ని తెలియజేసేలా ఉండేది. కానీ.. మారిన కాలంతో పాటు.. ఆలోచనలు మారి.. పిల్లల పేర్ల ఎంపికలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి.

మనదేశంలో ఇలాంటివి సాధ్యమే కానీ.. చాలా దేశాల్లో ఇలాంటి స్వేచ్ఛ ఉండదు. అందుకు డెన్మార్క్ లో అమలు చేసే నిబంధనలు చూస్తే.. వామ్మో అనక మానదు. ఆ దేశంలో.. వేరే దేశపు పేర్లు కానీ.. పిల్లల తల్లిదండ్రులు క్రియేటివిటీతో పేర్లు పెడతానంటే కుదరదని చెబుతున్నారు.

ఆ దేశంలో పిల్లలకు పెట్టదగిన పేర్లు కేవలం 24వేలు మాత్రమే. అందులో.. ఏదో ఒక పేరును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ.. జాబితాలో లేని తమకు నచ్చిన పేరున పెట్టే స్వేచ్ఛ ఆ దేశంలో లేదు. ఒకవేళ కాదూ.. కూడదంటే.. ఆ జాబితాలో లేని పేరు పెట్టాలంటే మాత్రం ముందస్తుగా ప్రభుత్వ అనుమతి అవసరం. అభివృద్ధి చెందిన దేశంగా పేరొంది డెన్మార్క్ లో కూడా ఇలాంటి నియమం కాస్తంత షాక్ కలిగించేదే కదూ.