చొరబాటులో పొరపాటుతో ప్రాణాలకే ఎసరు

Tue Aug 04 2015 15:42:18 GMT+0530 (IST)

దేశాన్ని దాటే ప్రయత్నంలో వేసిన ఎత్తుగడ ప్రాణాలు తీసింది. సరైన పత్రాలు లేకుండా సరిహద్దులు దాటాలన్న ప్రయత్నం ఈ లోకాన్నే దాటించేసింది. మొరాకో నుంచి మధ్యదరా సముద్రం మీదుగా స్పెయిన్ లోకి చేరుకునే క్రమంలో సూట్ కేసులో దాక్కుని వెళ్లబోయి మొరాకోకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు.

స్పెయిన్ మొరాకో దేశాలను జిబ్రాల్టర్ జలసంధి వేరుచేస్తుంది. మొరాకో ఇతర ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాల్లోకి అక్రమంగా వలస వెళ్లేవారు మొరాకో నుంచి స్పెయిన్ మీదుగా వెళ్లడానికే ప్రయత్నిస్తారు. స్పెయిన్ అన్నివిధాల అభివృద్ధి చెందిన దేశం కావడంతో మొరాకో నుంచి స్పెయిన్ కు వలసలు అధికంగా ఉంటాయి. అయితే.. సరైన పత్రాలు లేకుండా చొరబడేందుకు నిత్యం చాలామంది ప్రయత్నిస్తుంటారు. అందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. మొరాకో నుంచి స్పెయిన్ కు వెళ్లడానికి జిబ్రాల్టర్ జలసంధిని బోట్లు ఫెర్రీలపై దాటుతారు. అయితే... స్పెయిన్ లో అడుగుపెట్టిన తరువాత అధికారులకు దొరికితే పత్రాలు చూపించాల్సిందే. ఈ క్రమంలో రెండు రోజుల కిందట మొరాకోకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు స్పెయిన్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. వారిలో ఒకరి వద్ద ఫ్రెంచి పాస్ పోర్టు ఉంది... రెండో వ్యక్తి దగ్గర అది కూడా లేదు. ఫ్రెంచి పాస్ పోర్టు సహాయంతో మెల్లగా అధికారులకు  నచ్చజెప్పి అన్న వెళ్లేలా.... అన్న సూట్ కేసులో దాక్కుని తమ్ముడు వెళ్లేలా ప్లాన్ చేశారు. అయితే... ఈ ప్లాను బెడిసికొట్టి తమ్ముడు ఏకంగా ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. సూట్ కేసులో ఉన్నప్పుడు ఊపిరాడక ప్రాణాలు పోగొట్టుకున్నాడు. స్పెయిన్ దక్షిణ ప్రాంతానికి ఫెర్రీ ఇంకా చేరుకోకముందే అన్న తన తమ్ముడి పరిస్థితి చూసి వైద్య సహాయం కోసం ప్రయత్నించడంతో విషయం బయటపడింది.