Begin typing your search above and press return to search.

ఒబామా మీద ''14 ఏళ్ల జైలుశిక్ష'' కేసు బుక్‌ చేస్తారా?

By:  Tupaki Desk   |   8 July 2015 4:54 AM GMT
ఒబామా మీద 14 ఏళ్ల జైలుశిక్ష కేసు బుక్‌ చేస్తారా?
X
ఏ దేశానికి ఆ దేశానికి కొన్ని నిబంధనలు.. సంప్రదాయాలు.. సంస్కృతి ఉంటుంది. ఆయా దేశాలకు వెళ్లే అతిధులు అలాంటి వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రాశ్చాత్య నాగరికతను ఆ సమాజం మీద రుద్దాలని ప్రయత్నించటం కచ్ఛితంగా ఇబ్బంది కలిగించే అంశమే. అయితే.. అలాంటి ప్రయత్నం చేసే వారు ఎంతటి శక్తివంతులైనా సరే.. పట్టించుకోని దేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటి జాబితాలో తాజాగా చేరింది కెన్యా.

ఆ దేశానికి ఈ నెల చివరులో ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పర్యటించనున్నారు. అయితే.. తన పర్యటనలో భాగంగా గే హక్కుల గురించి ఒబామా గళం విప్పే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కెన్యా నేతలు తీవ్రంగా మండిపడుతూ.. అలాంటి విషయాల మీద కానీ ఒబామా మాట్లాడితే తిప్పలు తప్పవని చెబుతున్నారు.

వివాదాస్పద అంశాల మీద ఒబామా ఎందుకు మాట్లాడతారు అని అంటే.. గతంలో ఆయన దక్షిణ ఆఫ్రికా.. టాంజానియా.. సెనెగల్‌ దేశాల్లో పర్యటించిన సందర్భంగా ఆయా సమాజాల్లో పెద్దగా మాట్లాడుకోని గే హక్కుల గురించి మాట్లాడిన నేపథ్యంలో.. తాజా కెన్యా పర్యటనలోనూ ఆయన నోటి నుంచి అలాంటి మాటలు వచ్చే అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. అందుకే.. కెన్యా నేతలు హెచ్చరిస్తూ.. గే హక్కులకు సంబంధించిన అంశాల్ని ప్రస్తావిస్తే తిప్పలు తప్పవని వార్నింగ్‌ ఇస్తున్నారు.

తమ సమాజంలో గే అంటే ఈసడించుకుంటారని.. అంతేకాదు.. గే మ్యారేజీల గురించి మాట్లాడితే 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారని.. అందుకే మాట్లాడే మాటల్లో గే ప్రస్తావన లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. మరి.. ఒబామా ఇలాంటి వాటిని పట్టించుకుంటారా? లేదా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఒకవేళ ఒబామా నోటి నుంచి గే ప్రస్తావన వస్తే.. దానికి సంబంధించి 14 ఏళ్లు జైలుశిక్ష విధించే కేసు నమోదు చేసే ధైర్యం చేస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఏమీ లేకుండా వెళ్లామా? వచ్చామా? అన్నట్లుగా కెన్యా పర్యటనను ఒబామా పూర్తి చేస్తారా? అన్నది కొద్దికాలం ఆగితే తెలిసిపోనుంది.