కారునే లేపి పక్కన పెట్టేశాడు

Mon Aug 03 2015 19:42:25 GMT+0530 (IST)

మనం పార్క్ చేసిన బైక్ కు అడ్డంగా ఏదైనా కారును.. లేదంటే బైకును అడ్డు పెడితే ఏం చేస్తాం? తిట్టుకోవటం.. తల పట్టుకోవటం.. లేదంటే.. చుట్టూ చూసి.. సదరు బండి ఓనర్ వచ్చే వరకూ ఆగి.. వాడినో నాలుగు మాటలు అని మన దారిన మనం పోతాం.

కానీ.. బ్రెజిల్ కు చెందిన  ఓ పెద్ద మనిషి మాత్రం అందుకు భిన్నమైన చేష్టకు పాల్పడ్డాడు. తన సైకిల్ వెళ్లకుండా.. బైకులు పార్క్ చేయాల్సిన ప్రాంతంలో కారును పార్క్ చేయటం చూసి పిచ్చ  కోపం వచ్చింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా.. సైకిల్ స్టాండ్ వేసి.. రెండు చేతులతో సదరు కారును ఎత్తి.. పక్కన పెట్టేసి.. తన సైకిల్ మీద తన దారిన తాను వెళ్లిపోయాడు.

చిన్నపిల్లోడు బొమ్మను ఎత్తేసినట్లుగా.. అంత పెద్ద కారును పక్కన పెట్టేయటాన్ని ఎవరో గుర్తు తెలీని వ్యక్తి వీడియో తీసేసి.. యూట్యూబ్ లో పెట్టేశాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో అదరగొట్టేస్తోంది. ఇంతా చేస్తే.. సదరు అపర భీముడు ఎవరన్నది తెలీదు.