Begin typing your search above and press return to search.

ఏం తెలివితేటలో; రూ.3.83కోట్ల ఆస్తి రూ.13వేలకు ఇస్తారట

By:  Tupaki Desk   |   3 Aug 2015 7:08 AM GMT
ఏం తెలివితేటలో; రూ.3.83కోట్ల ఆస్తి రూ.13వేలకు ఇస్తారట
X
మన దగ్గర ఒకటి కొంటే రెండు ఫ్రీ.. రెండు కొంటే ఐదు ఫ్రీ అని.. మొత్తం 70 శాతం డిస్కౌంట్ అని నోరూరించే ఆఫర్లు చాలానే చూస్తుంటాం. ప్రతి ఆఫర్ ప్రకటన పైనో.. కిందనో ఒక చిన్న చుక్క కనిపిస్తుంది. ఆ చుక్క గురించి ఆరా తీస్తే.. ‘‘షరతులు వర్తిస్తాయి’’ అని సింఫుల్ గా రాసేస్తుంటారు.

అలాంటి బాపతే తాజా యవ్వారం కూడా. అమెరికాలోని వర్జీనీయాకు చెందిన రాండీ సిల్వర్స్.. కారొలిన్ బెర్రీ జంట తమకున్న 35 ఎకరాల్లోని ఫాంహౌస్ ని అమ్మాలనుకున్నారు. అందరిలా అమ్మేస్తే.. రూ.3.83కోట్ల వరకూ వచ్చేస్తుంది. కానీ.. వారికి ఆ ధర సుతారమూ ఇష్టం లేదు. దాంతో భారీగా లాభం పొందాలనుకున్నారు. అంతే.. ఓ ఐడియా వేశారు.

రూ.3.83కోట్ల విలువ చేసే తమ ఇంటిని కేవలం రూ.13వేల (200 అమెరికన్ డాలర్లు)కు ఇచ్చేస్తామని ఊరిస్తున్నారు. ఇందుకోసం మేమేం చేయాలని అడిగితే.. ఫాంహౌస్ ని కొనుక్కున్న తర్వాత ఎంత బాగా చూసుకుంటారో చెబుతూ.. ఒక వ్యాసం రాయాలి. అందంగా.. అద్భుతంగా.. తప్పుల్లేకుండా.. భావోద్వేగం ఏ మాత్రం మిస్ కాకుండా ఆ లేఖ ఉండాలట. అలా తమకు వచ్చే లేఖల్లో అత్యుత్తమమైన 25 లేఖల్ని ఎంపిక చేసి..నిపుణుల సూచన మేరకు అద్భుతంగా రాసినోళ్లకు ఫౌంహౌస్ ని ఇచ్చేస్తామని చెబుతున్నారు. ఇలా ఇంటి కోసం ఎంట్రీ ఫీజుగా 200 డాలర్లు చెల్లించాలని కోరుతున్నారు.

ఇల్లు అమ్మాలనుకుంటే అమ్మేయొచ్చు కానీ.. ఈ పోటీ ఏమిటి? అన్న కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఎందుకంటే.. అసలు కిటుకు అంతా ఈ పోటీలోనే ఉంది. తాము పెట్టిన షరతుకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందని.. తక్కువలో తక్కువగా ఐదు వేల మంది అయినా పోటీలో పాల్గొంటారని.. వారి ద్వారా వచ్చే ఎంట్రీ ఫీజు రూపంలో తక్కువలో తక్కువగా రూ.6.40 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నది ఈ దంపతుల ఆలోచన. అదే జరిగితే.. మార్కెట్ ధర కంటే డబుల్ వచ్చేసినట్లే. అందుకే.. ఈ వినూత్నమైన ఐడియా వేసినట్లుగా చెబుతున్నారు.

మీ అనుమానం అర్థమైంది. తెలివి వాళ్ల సొత్తే కాదు కదా.. ఈ విచిత్రమైన పోటీకి ఆదరణ లభించకుండా.. వారు అనుకున్నట్లు 5వేల మంది పోటీలో పాల్గొనకపోతే ఏం చేస్తారా? అంటే.. సింఫుల్ గా తమకు లేఖల్ని.. ఎంట్రీ ఫీజుల్ని పంపిన వారికి.. ఆ మొత్తాన్ని తిరిగి పంపేసి చేతులు దులుపేసుకుంటారు. ఆ మాత్రం దూరాలోచన లేకుండా.. రూ.3కోట్ల ఇంటిని రూ.13వేలకు అమ్మాలనుకుంటారా? ఏమిటి..?