Begin typing your search above and press return to search.

షావోమీ సంచలనం.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 800కి.మీ.

స్మార్ట్ ఫోన్లను సామాన్యులకు మరింత దగ్గర చేసిన చైనా ఫోన్ల కంపెనీగా షావోమీని చెప్పాలి

By:  Tupaki Desk   |   29 Dec 2023 4:19 AM GMT
షావోమీ సంచలనం.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 800కి.మీ.
X

స్మార్ట్ ఫోన్లను సామాన్యులకు మరింత దగ్గర చేసిన చైనా ఫోన్ల కంపెనీగా షావోమీని చెప్పాలి. మన దేశంలో ఆ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లు ఒక సంచలనం అన్న విషయం తెలిసిందే. ఈ సంస్థ తమ తొలి విద్యుత్ కారును ఆవిష్కరించింది. బీజింగ్ లో జరిగిన కార్యక్రమంలో సంస్థ సీఈవో ఈ కారును పరిచయం చేయటం.. నిమిషాల వ్యవధిలో ఈ కారు సంచలనంగా మారటమే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం.. ఈ కారుకున్న అద్భుతమైన ఫీచర్లే. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 800కి.మీ. ప్రయాణించే సత్తా ఉన్న ఈ కారు మీద పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది.

‘‘ఎస్ యూ7’’ పేరుతో మార్కెట్ లోకి రానున్న ఈ సెడాన్ కారులో ఉన్న ఆపరేటింగ్ సిస్టం.. కంపెనీకి చెందిన ప్రముఖ ఫోన్లతో ఇంటర్ లింక్ అయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కార్ల కంపెనీగా పేర్కొనే బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో అమర్చారు. రానున్న 15-20ఏళ్లలో ప్రపంచంలో టాప్ ఫైవ్ దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామన్న ధీమాను సంస్థ సీఈవో లీ జున్ వ్యక్తం చేయటం ఆసక్తికరంగా మారింది.

సెల్ టు బాడీ టెక్నాలజీని డెవలప్ చేశామని.. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లగా పేర్కొన్నారు. దీంతో.. కారు మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పిన లీ జున్.. ‘‘రెండు వేరియంట్లలో మార్కెట్ లోకి రానుంది. ఎస్ యూ 7 వేరియంట్ విషయానికి వస్తే కేవలం 5.28 సెకన్ల వ్యవధిలోనే 0-100 కిమీ. వేగాన్ని అందుకుంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 668 కి.మీ. గరిష్ఠ వేగం గంటలకు 210 కి.మీ’’ అని పేర్కొన్నారు

ఇక.. ఎస్ యూ7 మ్యాక్స్ విషయానికి వస్తే.. 2.78సెకన్ల వ్యవధిలో 0-100కి.మీ. వేగాన్ని అందుకుంటుందని.. ఒక్క ఛార్జింగ్ తో 800కి.మీ. వరకు ప్రయాణించే సత్తా ఉందని సంస్థ చెబుతోంది. దీని గరిష్ఠ వేగం గంటకు 265 కి.మీ.గా చెబుతున్నారు. అయితే.. ఈ కార్ల ధరలు ఎంతన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఈ కార్ల ధరలు ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు.

ఈ కారుకున్న మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏమంటే.. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ వేగంగా ఛార్జ్ అయ్యలా దీన్ని తయారు చేశారు. మూడు రంగుల్లో లభించే ఈ కారు రానున్న రోజుల్లో వాహన మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారుతుందని చెబుతున్నారు. వచ్చే పదేళ్ల వ్యవధిలో వాహన రంగంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టాలన్న ఆలోచనలో షావోమీ ఉంది. ఈ వివరాల్ని ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.