Begin typing your search above and press return to search.

భారత్ కు ఫోర్డ్ తిరిగి వచ్చేయనుందా? తాజా సంచలనం!

తాజాగా ఆ నిర్ణయాన్ని ఆపేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   21 Dec 2023 4:03 AM GMT
భారత్ కు ఫోర్డ్ తిరిగి వచ్చేయనుందా? తాజా సంచలనం!
X

కొద్ది నెలల క్రితం వాహన ప్రియులకు షాకిచ్చిన అమెరికా వాహన దిగ్గజం ఫోర్డ్.. భారత్ నుంచి వీడిపోనున్నట్లుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటుందా? భారత్ నుంచి వెళ్లిపోయే కన్నా.. ఇక్కడే ఉండేలా నిర్ణయం తీసుకుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఫోర్డ్ యాజమాన్యం చెన్నైలోని తన ప్లాంట్ ను అమ్మేయాలనుకున్న అంశాన్ని మధ్యలో ఆపేసినట్లుగా చెబుతున్నారు. ఫోర్డ్ చెన్నై ఫ్లాంట్ ను జేఎస్ డబ్ల్యూ స్టీల్ కు అమ్మాలని భావించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని ఆపేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిప్పుడు తాజా సంచలనంగా మారింది.

అమెరికా వాహన దిగ్గజంగా పేర్కొనే ఫోర్డ్ భారత్ కు 1991 తర్వాత వచ్చింది. పీవీ షురూ చేసిన ఆర్థిక సంస్కరణలకు ఆకర్షితులై భారత్ కు వచ్చిన తొలితరం ఆటో మొబైల్ సంస్థల్లో ఫోర్డ్ ఒకటి. వందలాది కోట్ల రూపాయిల్ని పెట్టుబడులుగా పెట్టిన ఈ సంస్థ.. భారత్ లోనే కార్ల ఉత్పత్తి.. అమ్మకాలను చేపట్టింది. అయితే.. భారత వాహనదారుల అభిరుచిని పసిగట్టటంలో ఫెయిల్ అయ్యిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. మొదట్లో భారతీయులుచిన్నకార్ల మీద ఎక్కువగా మక్కువ చూపే వారు.ఆ విషయాన్ని గుర్తించే విషయంలో ఫోర్డ్ ఫెయిల్ అయ్యిందన్న మాట వాహన మార్కెట్ వర్గాలు చెబుతుంటాయి.

అయితే.. వినియోగదారుల అభిరుచిని పెద్దగా పట్టించుకోని ఫోర్డ్.. వాటి ఉత్పత్తి మీద పెద్దగా ఫోకస్ చేసిందిలేదు. ఒకట్రెండు మోడళ్లు తప్పించి.. ఉండేవి కావు. దీంతో..తన పోటీదారులైన మారుతి.. హ్యుండయ్ తో పోటీ పడలేకపోయేది. దీంతో భారత్ మార్కెట్ వాటాలో 2 శాతాన్ని మించలేదు. ఈ పరిణామాలతో 2000 నుంచి 2021 మధ్య కాలంలో ఈ సంస్థ భారత్ లో కార్ల ఉత్పత్తి.. అమ్మకాల ద్వారా రూ.200కోట్ల డాలర్ల మేర నష్టాల్ని మూటగట్టుకుంది.

2020నాటికి దేశీయంగా మిగిలిన కార్ల అమ్మకాలకు.. ఫోర్డ్ అమ్మకాలకు పోల్చలేనంత గ్యాప్ పెరిగిపోతున్ననేపథ్యంలో.. భారత్ లో తన కార్యకలపాల్ని నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించి షాకిచ్చింది. దేశంలో ఫోర్డ్ కు రెండు కార్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. అందులో ఒకటి గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో ఉండగా.. రెండోది తమిళనాడులోని చెన్నైకు సమీపంలో ఉంది. సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో వాహన అసెంబ్లింగ్ ప్లాంట్ ఉంది. 110 ఎకరాల్లో ఇంజిన్ తయారు చేసే ప్లాంట్ ఉంది. గుజరాత్ ప్లాంట్ ను టాటా కు అమ్మేసిన ఫోర్డ్.. చెన్నై ప్లాంట్ ను అమ్మకానికి పెట్టింది. అయితే.. భారత్ లో పెరుగుతున్న వ్యాపార అవకాశాల్ని వదలుకోవటం ఇష్టం లేదంటున్నారు.

ఇందులో భాగంగా చెన్నైలోని రెండో ఫ్లాంట్అమ్మకానికి సంబంధించి మహీంద్రా అండ్ మహీంద్రా.. తైవాన్ ఎలక్ట్రానిక్ జెయింట్ విన్ ఫాస్ట్ పోటీ పడినా.. అవేవీ ముందుకు వెళ్లలేదు. ఇలాంటి వేళ ప్రముఖ స్టీల్ దిగ్గజ సంస్థ జేఎస్ డబ్యూలకు తమ ప్లాంట్ ను అమ్మేందుకు ఒప్పందాన్ని చివరి దశ వరకు వెళ్లింది. ఇలాంటి వేళ.. ఫోర్డ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం భారత్ లో తిరిగి తన కార్యకలాపాల్ని షురూ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. చెన్నై ప్లాంట్ విషయానికి వస్తే ఏడాదికి లక్షన్నర కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో పాటు.. మూడున్నర లక్షల కార్ల ఇంజిన్లను తయారు చేసే సామర్థ్యం ఈ ప్లాంట్ సొంతమని చెబుతారు.