Begin typing your search above and press return to search.

రివ్యూ: 2023లో అమ్ముడైన కార్లలో అత్యధికం ఏవి?

వాహన రంగం దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. గతానికి భిన్నంగా 2023లో వాహన రంగం అంచనాలకు తగ్గట్లుగానే జోరు మీద ఉంది.

By:  Tupaki Desk   |   3 Jan 2024 6:16 AM GMT
రివ్యూ: 2023లో అమ్ముడైన కార్లలో అత్యధికం ఏవి?
X

వాహన రంగం దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. గతానికి భిన్నంగా 2023లో వాహన రంగం అంచనాలకు తగ్గట్లుగానే జోరు మీద ఉంది. 2022తో పోలిస్తే.. 2023లో కార్ల అమ్మకాలు భారీగా ఉండటమే కాదు.. గతంలో మరే సంవత్సరంలోనూ ఇంత భారీగా ఒక ఏడాదిలో ఇంత భారీగా అమ్ముడు కాలేదని ఈ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. 2022తో పోలిస్తే 2023లో కార్ల అమ్మకాలు 8.3 శాతం పెరిగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు.. కార్ల కొనుగోలులో వినియోగదారుల అభిరుచిలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. 2023లో చిన్న కార్ల అమ్మకాలతో పోలిస్తే ఎస్ యూవీల అమ్మకాల జోరు బాగా పెరిగింది.

ఎప్పటిలానే కార్ల అమ్మకాల్లో మారుతి సుజికి తన జోరును ప్రదర్శించింది. ఎక్కువ వాహనాల్ని అమ్మిన కంపెనీగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో హ్యుందాయ్.. టాటా మోటార్స్.. టయోటా లాంటి కంపెనీలు నిలిచాయి. మహేంద్ర కార్లకు భారీ డిమాండ్ నెలకొన్న సంగతి తెలిసిందే. 2022లో సగటు కారు ధర రూ.10.58 లక్షలు పలికితే.. 2023లో మాత్రం రూ.11.5 లక్షలకు పెరగటం గమనార్హం. కార్ల అమ్మకాల్లో ఎస్ యూవీల అమ్మకాలు 26 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు. మొత్తం కార్లలో ఎస్ యూవీల వాటా 2022లో 42 శాతం ఉంటే.. 2023లో అదికాస్తా 48.7 శాతానికి పెరిగింది. హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్ల అమ్మకాలు 34.8 శాతం నుంచి 38 శాతానికి పెరిగాయి.,

ఈ రెండు విభాగాలతో పోలిస్తే.. సెడాన్ కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి. 2023లో సెడాన్ కార్ల విక్రయాలు అంతకు ముందు ఏడాది ఉన్న 11 శాతంతో పోలిస్తే 9.4 శాతానికి తగ్గిపోవటం కనిపించింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే కార్ల సంఖ్య కూడా 2023లో పెరిగటం గమనార్హం. గత ఏడాది 2.69 లక్షల యూనిట్లు ఎగుమతి అయ్యాయి. మొత్తంగా 2023 వాహన రంగానికి ఒక మంచి సంవత్సరంగా చెప్పక తప్పదు