Begin typing your search above and press return to search.

కారు అమ్మడమూ ఒక కళే...

By:  Tupaki Desk   |   29 Jun 2015 10:10 AM GMT
కారు అమ్మడమూ ఒక కళే...
X
కొత్త కారు కొనేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం.. ఎంతో స్టడీ చేస్తాం.. అలాగే పాత కారు అమ్మేటప్పుడూ అన్నే జాగ్రత్తలు తీసుకోవాలి... చాలా మెలకువలు పాటించాలి. కారును కొద్ది రోజులు ఉపయోగించిన తర్వాత మంచి మొత్తానికి విక్రయించడం మాత్రం చాలా కష్టమైన పని. సెకండ్ హ్యాండ్ కార్లను నేరుగా విక్రయించలేనివారు సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్/డీలర్ల మాయలో పడి మోసపోతుంటారు. కారు కండిషన్ లో ఉండి.. పత్రాలన్నీ కరెక్టుగా ఉంటే మంచి ధరకే అమ్మొచ్చు...

కారు అమ్మే ముందు..

- పాత కారును విక్రయించడానికి ముందుగా దాన్ని శుభ్రంగా కడిగి.. సర్వీసింగ్ చేయించాలి. అవసరమైతే బాడీకి పాలిషింగ్ చేయించి తళతళమెరిసేలా చేయాలి. కారులోని ఇంటీరియర్లను కూడా వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయాలి. కారు ఎంత అందంగా కనిపిస్తే అంత మంచింది.

- ఒకవేళ మీరు ఇంటర్నెట్ లో కారును విక్రయించాలనకుంటే, ఆ కారుకు సంబంధించి మంచి ఫొటోలను తీయండి. కారులోని ప్రతి అంశాన్నీ ఫొటో తీసి అప్ లోడ్ చేయాలి.

- ధర కోసం మీ వాహన రీడింగ్‌ని ట్యాంపర్ చేసే ప్రయత్నం చేయకండి. ఇంటర్నెట్‌లో కారు ఫొటోలను అప్‌లోడ్ చేసేటప్పుడు కారు అప్పటి వరకూ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూపించే రీడింగ్ ఫొటోని కూడా పెట్టండి. ఆ విషయంలో మోసం చేయొద్దు.

- అసలు మీ కారు ఎంత విలువ చేస్తుందనే విషయాన్ని తెలుసుకోండి. ఇంటర్నెట్‌లో యూజ్డ్ కార్ ఎవాల్యుషన్ అని వెతికితే... దాని మోడల్, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది... స్థితి ఎలా ఉంది అనే అంశాల ఆధారంగా దాని విలువ లెక్కించే వెబ్ సైట్లున్నాయి. వాటి సహాయంతో మీ కారు విలువ లెక్కించి దాన్ని బట్టి ధర నిర్ణయించండి.

- సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే బ్రోకర్లు చెప్పే మాటలకు మోసపోవద్దు... వీలైతే డైరెక్టు పార్టీకే విక్రయించండి.

- ధర విషయంలో తగ్గకండి ఎంతో కొంత వస్తే సరిపోతుందిలే అని, మీరు నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకు మాత్రం మీ పాత కారును విక్రయించకండి. ఒకవేళ మీ కారును లక్ష రూపాయలకు విక్రయించాలని నిర్ణయించుకుంటే, ఆ ధరకు మీరు ఏ మాత్రం తగ్గకండి. కస్టమర్లు ఎవరూ రావట్లేదని 80 వేలకే విక్రయించేయకండి. బేరమాడే కస్టమర్లు ఉంటారు, కానీ నిజమైన కస్టమర్లు దొరికితే మీ కారుకు అనుకున్న ధర వచ్చేస్తుంది. తొందరపడకుండా ఓపికపట్టి విక్రయించాలి.

- కారుకు సంబంధించిన వివరాల్లో దాపరికం వద్దు. ఒరిజినల్ డాక్యుమెంట్ కాపీలను చూపించండి. ఒకవేళ అతను కారును టెస్ట్ డ్రైవ్ చేస్తానంటే, టెస్ట్ డ్రైవ్‌ని ఆఫర్ చేయండి.

- అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కారు విక్రయించిన వెంటనే పత్రాలు కొనుగోలుదారు పేరిట ట్రాన్స్ ఫర్ చేయండి.. ఆలస్యం వద్దు. ఎందుకంటే వారు ఎక్కడైనా యాక్సిడెంట్ చేస్తే అది మీ మెడకు చుట్టుకుంటుంది.