మహీంద్ర ఎలక్ట్రిక్ రేవా ఈ2ఓ కారు వచ్చేసింది

Wed Jul 29 2015 09:46:52 GMT+0530 (IST)

మారుతున్న కాలానికి తగ్గట్లుగా సరికొత్త కార్లు వచ్చేస్తున్నయి. పెట్రోల్.. డీజిల్ లాంటి ఇంధన సమస్యల్లేకుండా.. విద్యుత్తుతో నడిచే రేవా కారుకు సంబంధించి తాజా మోడల్ హైదరాబాద్ లో లాంఛ్ చేశారు. రేవా సీరిస్ లో ఎలక్ట్రిక్ కార్లు వచ్చినప్పటికీ.. తాజాగా విడుదల చేసిన ‘‘రేవా ఈ2ఓ’’ మరింత అడ్వాన్స్ అని చెప్పొచ్చు.

 హైదరాబాద్ లో ఈ కారు ధర రూ.5.59లక్షలు (ఎక్స్ షోరూం). కారు అమ్మకంతో పాటు.. ఈ2ఓ కేర్ ప్రొటెక్షన్ కింద ఐదేళ్ల పాటు కొనుగోలుదారు ప్రతి నెలా రూ.2999 చెల్లించాల్సి ఉంటుంది. 50వేల కిలోమీటర్ల వరకూ ఈ విధానం వర్తిస్తుంది.

కాలుష్యానికి దూరంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ కారు ఆదరణకు కొన్ని అవరోధాలున్నట్లు చెబుతున్నారు. టెక్నికల్ గా కారు బాగున్నప్పటికీ.. దీని ధర కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు.. ఛార్జింగ్ సదుపాయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ చేసే కేంద్రాలు పరిమితంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలోఇలాంటి చార్జింగ్ కేంద్రాలు 23 మాత్రమే ఉన్నాయి. వాటిల్లోకూడా ఛార్జింగ్ అమిత వేగంగా చేసే వ్యవస్థల్ని సిద్ధం చేసేలా ఉండాలి.

అయితే.. ఈ కారు ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ కేంద్రాలకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఎదుకంటే.. ఇళ్లల్లోని 15 ఏఎంపీ సాకెట్ నుంచి కూడా ఈ2ఓ కారును ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాదు.. దీనికున్న సాంకేతికతతో.. కారులో ప్రయాణించటానికి ముందే.. మొబైల్ యాప్ ద్వారా.. ముందే ఏసీని ఆన్ చేసుకొని.. కూల్ గా ఉండేలా చేసుకునే సౌకర్యం ఉంది. అంతేకాదు.. ఛార్జింగ్ ఇండికేటర్ తో పాటు.. మరిన్నిసౌకర్యాలు ఈ కారులో ఉన్నాయని చెబుతున్నారు. పర్యావరణ హితాన్ని కోరుకునే వారు.. కాస్త ఖర్చు అయినా ఫర్లేదనుకునే వారికి తాజా ఎలక్ట్రిక్ కారు  బెస్ట్ ఛాయిస్ అంటున్నారు.