కళ్లు చెదిరిపోయే హోండా సీబీఆర్ 650 ఎఫ్

Wed Aug 05 2015 12:24:10 GMT+0530 (IST)

మోటార్ సైకిల్ రంగంలో తిరుగులేని హోండా.. మాంచి దూకుడు మీద ఉంది. తాజాగా తన సీబీఆర్ 650 ఎఫ్ స్పోర్ట్స్ బైక్ ని లాంచ్ చేసింది. చూడగానే కళ్లు తిప్పుకోలేనంత స్టైల్ తో రాజసం ఉట్టిపడేలా ఉన్న ఈ బైక్ కుర్రాకారుని విపరీతంగా ఆకర్షిస్తుందని చెప్పటంలో సందేహం లేదు.

మోనో షాక్ సస్పెన్షన్.. సిక్స్ స్పీడ్ ట్రాన్స్ మిషన్.. ఇంజిన్ కూలింగ్ ప్రత్యేకతలుగా విడుదల చేసిన ఈ స్పోర్ట్ బైక్ ధర కేవలం రూ.7.3 లక్షలు (ఎక్స్ షోరూం ధర) మాత్రమేనని చెబుతున్నారు.

ఉన్నత ఆదాయ వర్గాలతో పాటు.. బైకుల్ని విపరీతంగా ప్రేమించే సంపన్న వర్గాల్ని లక్ష్యంగా చేసుకొని ఈ బైక్ ను విడుదల చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడాదిలో భారత్ లో 15 మోడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న హోండా.. తన తాజా సీబీఆర్ 650 ఎఫ్ బైక్ తో పదకొండు కొత్త మోడళ్లను మార్కెట్ లోకి తెచ్చినట్లు అయ్యింది.

గడిచిన ఏడు నెలల్లో.. 110 సీసీ లైవో.. హోండా సీబీఆర్ 250ఆర్.. హోండా సీబీ 150ఆర్.. సీబీ హార్నెట్ 160 ఆర్.. తో పాటు మరికొన్ని మోడళ్లను విడుదల చేశారు. ఈ ఏడాది చివర్లో మిస్టరీ అనే మోడల్ ను విడుదల చేయనున్నారు.