Begin typing your search above and press return to search.

పెట్రోలు.. నీళ్లు జత కలిస్తే మోర్ మైలేజ్

By:  Tupaki Desk   |   9 Aug 2015 7:20 AM GMT
పెట్రోలు.. నీళ్లు జత కలిస్తే మోర్ మైలేజ్
X
వినటానికి విచిత్రంగా ఉన్నా.. సరికొత్త సాంకేతికతను ప్రదర్శిస్తున్నాడో తెలుగోడు. నీటితో వాహనాల మీద ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. పెట్రోల్.. డీజిల్ కు.. నీటిని తోడు చేస్తే మరింత మైలేజ్ రావటమే కాదు.. కాలుష్యం తగ్గి.. ఇంజిన్ మరింత మెరుగ్గా పని చేస్తుందని చెబుతున్నాడు.

ఇదంతా మాటల్లోనే కాదు.. తాను తయారు చేసిన కిట్ తో చేతల్లో చూపిస్తున్నాడు గుంటూరుకు చెందిన సుందర్. ఇతగాడు కనిపెట్టిన వినూత్న పద్ధతిపై ఆసక్తి వ్యక్తమవుతోంది. తాను రూపొందించిన టెక్నాలజీ కోసం తొమ్మిదేళ్లు కష్టపడినట్లు చెప్పిన సుందర్.. తన సాంకేతికతను ఇలా వివరిస్తున్నారు.

‘‘నీటిని ఆక్సిజన్.. హైడ్రోజన్ లుగా విడకొట్టే విధానం ఆధారంగా వాహన మైలేజీ పెంచటం.. ఇంజిన్ సామర్థ్యాన్ని మెరుగుపర్చటం.. కాలుష్యాన్ని తగ్గించటే లక్ష్యం. ఇందుకోసం కొన్ని రసాయనాలు కలిపిన నీటిని ఒక కిట్ గా రూపొందించా. దీని ఆధారంగా నీటిలోని హైడ్రోజన్.. ఆక్సిజన్ మూలకాలను విడగొట్టి.. హైడ్రోజన్ ను నేరుగా ప్రత్యేక పరికరం ద్వారా ఇంజిన్ కు పంపుతుంది. దీంతో.. వాహనం స్టార్ట్ చేయగానే అది పని చేస్తుందని చెబుతున్నాడు.

తాను తయారు చేసిన పరికరం ద్వారా.. వాహనం స్టార్ట్ చేయగానే విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ తగ్గి.. ఆక్సిజన్ విడుదల అవుతుందని చెబుతున్నాడు. 100 సీసీ బైక్ కు తాను రూపొందించిన సాంకేతికతను అమరిస్తే లీటరు పెట్రోల్ కు 80 నుంచి 90 కిలోమీటర్ల మేర మైలేజీ వచ్చే వీలుందని చెబుతున్నాడు. మరి.. సుందర్ రూపొందించిన టెక్నాలజీపై సర్కారు నజర్ పడితే.. మరింత మంచిది. సుందర్ పరిశోధనలోని శాస్త్రీయతను గుర్తించి.. అతగాడు చెబుతున్న సాంకేతికత సరైనదేనని తేలితే.. అతను చేసే పరిశోధనలకు ప్రభుత్వం మరింత ఊతం ఇస్తే.. అందరికి ప్రయోజనం. మరి.. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఎవరు ముందు స్పందిస్తారో..?