చైనా రాజధానిలో కారు వినియోగం పైనా రేషన్

Tue Aug 04 2015 12:22:29 GMT+0530 (IST)

పిల్లల్ని పుట్టించే విషయంలో చైనాలో రేషన్ సాగుతోంది. ఒకరికి మించి పిల్లల్ని కనాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఈ మద్యనే ఈ నిబంధనను కాస్త సడలించారు. అలాంటి చైనాలో సరికొత్త రేషన్ విధించారు. కారు వినియోగంలో పరిమితులు పెట్టేశారు. రోడ్డు మీద కారు తేవాలన్నా చిక్కులే. తాజాగా ఆ దేశ రాజధానిలో జరగనున్న వివిధ కార్యక్రమాల కోసం నెల రోజుల పాటు కార్ల  వినియోగం మీద రేషన్ విధించారు ఆ దేశ అధికారులు.

దీని  ప్రకారం.. ఆగస్టు 20 నుంచి సెప్టెంబరు 3 వరకూ బీజింగ్ లో కారు వినియోగం మీద కొత్త ఆంక్షల్ని విధించారు. దీని ప్రకారం.. బేసి సంఖ్యతో ఉన్న కారు ఒకరోజు మాత్రమే వాడాలి. ఆ తర్వాతి రోజు సరి సంఖ్యతో ఉన్న కారును మాత్రమే రోడ్డు మీదకు తేవాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా చుక్కలు కనిపించటం ఖాయం.

ఎందుకిలా అంటే.. బీజింగ్ లో ఆగస్టు 22 నుంచి ఐఏఏఎఫ్ ప్రపంచ అధ్లెటిక్ చాంఫియన్ షిప్ జరగనుంది. అదే సమయంలో సెప్టెంబరు 3న రెండో ప్రపంచ యుద్ధ విజయాన్ని పురస్కరించుకొని బీజింగ్ లో విక్టరీ పరేడ్ జరగనుంది. ఈ రెండు కార్యక్రమాల కారణంగా.. ఉన్న కార్లలో సగం కార్లను రోడ్డు మీదకు రాకుండా ఉండేందుకు వీలుగా.. నెల రోజుల పాటు ఈ కార్ల రేషన్ విధించారు. అంటే.. రోజూ కారు రోడ్డు మీదకు తేవాలంటే.. ఒకే వ్యక్తికి ఒక సరి సంఖ్యతో కారు.. ఒక బేసి సంఖ్యతో ఉన్న కారు ఉంటే సరిపోతుందన్న మాట.