Begin typing your search above and press return to search.

అక్కడ ‘నోటా’ ముందు ఓడిన మెజారిటీ !

ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది.

By:  Tupaki Desk   |   11 May 2024 6:35 AM GMT
అక్కడ ‘నోటా’ ముందు ఓడిన మెజారిటీ !
X

ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) బటన్ ను ఏర్పాటు చేశారు. ఏ ఎన్నికలలో అయినా అభ్యర్థులు మీకు నచ్చకుంటే నోటాకు ఓటేసుకోవచ్చు. అయితే నోటాకు వచ్చిన ఓట్లకన్న తక్కువ ఓట్ల మెజారిటీతో విజేతలుగా నిలిచిన అరుదైన సంఘటనలు కూడా ఉన్నాయి.

2019 లోక్ సభ ఎన్నికలలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయి మల్కాజ్ గిరిలో ఎంపీగా నిలబడ్డాడు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,919 ఓట్ల స్వల్ప అధిక్యంతో విజయం సాధించాడు. దేశంలోనే అతి పెద్దదైన ఈ నియోజకవర్గంలో 15,63,646 ఓటు హక్కు వినియోగించుకోగా అక్కడ నోటాకు 17,895 ఓట్లు నమోదు కావడం విశేషం. పోలైన ఓట్లలో ఇది 1.14 శాతం.

నల్లగొండ శాసనసభకు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి నుండి ఎంపీగా పోటీ చేసి కేవలం 5,119 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ మీద విజయం సాధించాడు. ఇక్కడ నోటాకు 12,021 ఓట్లు నమోదు కావడం విశేషం. అంటే మెజారిటీకి రెట్టింపు ఓట్లు వచ్చాయి. ఇక్కడ మొత్తం 12,12,631 ఓట్లు పోలయ్యాయి.

ఇక జహీరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కేవలం 6229 ఓట్లతో విజయం సాధించాడు. అక్కడ నోటాకు 11,640 ఓట్లు నమోదు కావడం విశేషం. ఇక్కడ 10,44, 504 ఓట్లు పోలయ్యాయి. ఈ మూడు చోట్లా నోటాకు ఒక శాతానికి మించి ఓట్లు రావడం, అవి మెజారిటీ కంటే ఎక్కువగా ఉండడం ఆశ్చర్యకరం.