Begin typing your search above and press return to search.

బహుమతులు.. విందులు.. సోషల్ మీడియా సైన్యంపై తెలుగు సీఎంల ప్రేమ

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకూ సోషల్ మీడియా సిబ్బంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీరినే సోషల్ మీడియా వారియర్లు అని పిలుచుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   17 May 2024 10:27 AM GMT
బహుమతులు.. విందులు.. సోషల్ మీడియా సైన్యంపై తెలుగు సీఎంల ప్రేమ
X

గతంలో యుద్ధాలకు వెళ్లే రాజులు తమ సైన్యాన్ని నమ్ముకునేవారు. ఎంత పెద్ద సైన్యం ఉంటే అంత గర్వంగా ఫీలయ్యేవారు. అందులోని వీరుల గురించి గొప్పగా చెప్పుకొనేవారు. ఇప్పుడు ఎన్నికల యుద్ధానికి వెళ్తున్న పార్టీల అగ్ర నాయకులూ ఇదే విధంగా ఓ సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ప్రత్యర్థులపై కత్తులు నూరేందుకు దానినో ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఆ సైన్యమే ‘సోషల్ మీడియా’.

భౌతికంగా కంటే మానసికంగా..

రాజకీయ సమరంలో ఓ దశలో ప్రత్యర్థిని భౌతికంగా కంటే మానసికంగా దెబ్బతీసేందుకు సోషల్ మీడియా సైన్యాన్ని ప్రయోగిస్తున్నారు నాయకులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకూ సోషల్ మీడియా సిబ్బంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీరినే సోషల్ మీడియా వారియర్లు అని పిలుచుకుంటున్నారు. ఇక వీరంతా చేసేది ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం విధానాలను ఎండగట్టడం. ఆ పార్టీ నాయకులను అను క్షణం పరిశీలిస్తూ వారి తప్పులను పట్టుకుని డీ ఫేమ్ చేయడం. ప్రభుత్వంలో ఉన్న పార్టీ వారి సోషల్ మీడియా సైన్యం అయితే తమ సర్కారు పథకాలు, కార్యక్రమాలను హైలైట్ చేస్తుంది.

జగన్ అలా.. రేవంత్ ఇలా..

ఏపీ అధికార పార్టీ వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలను 2017 నుంచి ఐ-ప్యాక్ సంస్థ చూస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడంలో ఈ సంస్థదే కీలక పాత్ర అని చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈసారి ఐప్యాక్ లో దాని వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ లేకున్నా వైసీపీకి పనిచేసింది. తాజాగా ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీ సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ లోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో మనదే గెలుపు అని వారితో చెప్పారు. ఈ సందర్భంగా ఐప్యాక్ సిబ్బందికి జగన్ కొన్ని బహుమతులూ ఇచ్చినట్లు తెలిసింది.

రేవంత్ ఇలా..

తెలంగాణలో కాంగ్రెస్ కు సోషల్ మీడియా వార్ రూం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈ టీమ్ చాలా గట్టిగా పనిచేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రస్తావించారు. ఈ టీమ్ లోక్ సభ ఎన్నికల్లోనూ సమర్థంగా పనిచేయడంతో వారికి తాజాగా హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో విందు ఇచ్చారు. తద్వారా తమకు చేసిన సేవలకు అభినందనలు, ప్రశంసలు తెలిపారు.

సోషల్ మీడియా సైన్యంపై తమకు ఎంతటి నమ్మకం ఉందో తెలుగు రాష్ట్రాల సీఎంలు వ్యవహరించిన ఈ తీరుతో తెలిసిపోతోంది.