Begin typing your search above and press return to search.

రేవంత్ గ్రాఫ్ ఇప్పుడు తెలంగాణను దాటేసిందా?

కాలం కొత్త నాయకుల్ని.. కొత్త నాయకత్వాన్ని తెర మీదకు తీసుకొస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   4 May 2024 4:30 AM GMT
రేవంత్ గ్రాఫ్ ఇప్పుడు తెలంగాణను దాటేసిందా?
X

కాలం కొత్త నాయకుల్ని.. కొత్త నాయకత్వాన్ని తెర మీదకు తీసుకొస్తూ ఉంటుంది. అప్పటివరకు తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించే వారికి చెక్ పెడుతూ కొత్త అధినేతలు పుట్టుకొస్తుంటారు. అలాంటి జాబితాలోనే చేర్చాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. మంత్రిగా పని చేయకుండా ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం రేవంత్ మేజిక్ అయితే.. అది కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంపిక కావటం అసలుసిసలు విజయంగా చెప్పాలి.

మాటల్లోనూ.. చేతల్లోనూ తన మార్కును ప్రదర్శించే రేవంత్ కు ఉన్న సానుకూలాంశం ఏమంటే దూకుడుగా వ్యవహరించటం. ఈ విషయంలో ఆయన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు ఎదురవుతున్న ఇబ్బందులు.. సవాళ్ల గురించి తెలిసిందే. విపక్షంతో పాటు స్వపక్షంతోనూ అడుగడుగునా అడ్డంకుల్ని ఆయన ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తాను ఎంచుకున్న దారిలో వెళ్లిపోతున్నారు. వీలైనంతవరకు అందరిని కలుపుకుంటూ వెళుతున్న ఆయన.. అనవసరమైన దూకుడును ప్రదర్శించటం లేదు.

కేంద్రంలోని మోడీ సర్కారుతో తమకు పంచాయితీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన.. ప్రధాని పాల్గొన్న సభలో ఆయన సమక్షంలో బడే భాయ్ గా ప్రస్తుతించటం ద్వారా మంచి మార్కులే కొట్టేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోడీషాలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. దేశంలో మరే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ.. ఏ పీసీసీ అధ్యక్షుడు కానీ చేయనంత ఘాటుగా మోడీపై రేవంత్ ఫైర్ అవుతున్నారు.

మోడీని విమర్శించే విషయంలో రేవంత్ ప్రస్తావిస్తున్న అంశాలు లాజిక్కుతో కూడి ఉండటం.. తన వాదనతో అందరిని కన్వీన్స్ చేస్తున్న వైనం ఆకట్టుకునేలా మారింది. దీంతో.. దేశ వ్యాప్తంగా రేవంత్ తనదైన క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న ట్యాగ్ కంటే కూడా.. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉత్తరాది రాష్ట్రాల్లో రేవంత్ పాపులర్ అవుతున్నారు. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అధినేతలు.. ముఖ్యమంత్రులు ఉత్తరాదిలో పాపులర్ కారు.

కానీ.. అందుకు భిన్నంగా రేవంత్ ఇప్పుడు జాతీయ నాయకుడిగా రూపాంతరం చెందుతున్నారు. తన వాదనా పటిమతో హిందీ చానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ.. ప్రధాని మోడీ మీద సరికొత్త తరహాలో విమర్శలు చేయటం.. అదే సమయంలో హిందూ వ్యతిరేకిగా కాకుండా.. వారిపట్ల సానుకూలతను వ్యక్తం చేస్తూనే.. మోడీ విధానాల్ని విమర్శిస్తున్న వైనం అందరిని ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో రేవంత్ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్ని సీట్లను గెలుచుకుంటుందన్నది పక్కన పెడితే.. ఈ ఎన్నికల ద్వారా తన టాలెంట్ ను జాతీయ స్థాయికి విస్తరించేలా చేసుకోవటంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. ఈ లెక్కన మిగిలిన అధినేతలతో పోలిస్తే ఒక అడుగు ముందుకు వేయటమే కాదు.. ఎంపీ ఎన్నికల్లో గెలుపు తన బోనస్ అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి.