Begin typing your search above and press return to search.

పిన్నెల్లి సోదరులు ఇప్పుడెక్కడ? మాచర్లలో ఏం జరుగుతోంది?

మాచర్ల హింసలో వైసీపీ ఎమ్మెల్యే.. తాజాఎన్నికల్లోనూ అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి.. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇద్దరూ కీలక భూమిక పోషించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   18 May 2024 4:47 AM GMT
పిన్నెల్లి సోదరులు ఇప్పుడెక్కడ? మాచర్లలో ఏం జరుగుతోంది?
X

ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు కేంద్రంగా మారింది మాచర్ల. ఏపీలోని వివిధ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా.. ఆరంభం మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లా.. ప్రస్తుత పల్నాడు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోనే జరిగిందని చెప్పాలి. ఇక్కడ జరిగిన అల్లర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఓవైపు పోలీసులు ఉన్నా పట్టించుకోకుండా తాము చేయాల్సిన పనుల్ని చేసుకుంటూ పోయిన బరితెగింపు షాకింగ్ గా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం సైతం మాచర్ల ఎపిసోడ్ ను సీరియస్ గా తీసుకోవటం.. పలువురు పోలీసులు.. ఇతర శాఖల అధికారులపై చర్యలు తీసుకోవటం తెలిసిందే.

మాచర్ల హింసలో వైసీపీ ఎమ్మెల్యే.. తాజాఎన్నికల్లోనూ అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి.. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇద్దరూ కీలక భూమిక పోషించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండురోజుల క్రితం పోలీసులు మాచర్లలోని నేతల ఇళ్లల్లో నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున బాంబులు.. మారణాయుధాలు దొరికిన వైనంతో అందరూ షాక్ తిన్న పరిస్థితి. ఇప్పుడు జరిగిన హింసే ఇంతగా ఉంటే.. తనిఖీల్లో లభ్యమైన బాంబుల్నిఉపయోగించి ఉంటే.. పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందన్నది గగుర్పాటుకు గురి చేసేలా ఉందని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. మాచర్ల హింసకు కారణమైనట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి సోదరులు ఇప్పుడు ఎక్కడ? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఎవరికి చెప్పకుండా.. గన్ మెన్లను మధ్యలో దించేసి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మాచర్ల నుంచి హైదరాబాద్ కు పిన్నెల్లి సోదరులు వెళ్లినట్లుగా చెబుతున్నారు.

ఏపీ హైకోర్టు చివాట్లు పెట్టటం.. ఈసీ సీరియస్ కావటం.. ఎస్పీతో పాటు ఏడుగురు పోలీసు అధికారులపై వేటు.. కలెక్టర్ బదిలీ కారణంగా పరిస్థితుల్లో కాసింత మార్పు వచ్చింది. అదే సమయంలో.. పిన్నెల్లి సోదరులను పోలీసులు అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి వేళ.. శుక్రవారం గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. సాగర్ మీదుగా హైదరాబాద్ రూట్లో వెళ్లిన వారి వాహనాల్ని.. సాగర్ చెక్ పోస్టు వద్ద గన్ మెన్లను వెనక్కి పంపేశారు. ఈ విషయాన్ని గన్ మెన్లు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు.

గడిచిన రెండు దశాబ్దాలుగా పల్నాడులో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన పిన్నెల్లి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్టు అయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో పాటు.. తమ ప్రాబల్యానికి గండి పడుతుందన్న ఆలోచన కూడా వారిని ఊరు వదిలేలా చేసిందంటున్నారు. అయితే.. మీడియా కథనాలకు.. సోషల్ మీడియాలోని పోస్టులకు భిన్నంగా పిన్నెల్లి కొన్ని మీడియా సంస్థలకు అందుబాటులోకి వచ్చారు. తాను.. తన సోదరుడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. తాము కొన్ని వ్యక్తిగత పనుల మీద ఊరి నుంచి హైదరాబాద్ కు వచ్చామని.. త్వరలోనే తిరిగి వస్తామని సమాచారం ఇవ్వటం గమనార్హం. ఏపీలో జరిగిన ఎన్నికల్లో మాచర్ల హింస.. వైసీపీ నేత పిన్నెల్లి తీరు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.