Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో మాధవీలత గెలిస్తే...?

ఇక తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ లోక్ సభ స్థానంపైనే చర్చ జరుగుతుంది!

By:  Tupaki Desk   |   17 May 2024 4:38 AM GMT
హైదరాబాద్  లో మాధవీలత గెలిస్తే...?
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ముగిసింది. ఇక జూన్ 4న వచ్చే ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీలోని ఎన్నికలపైనే ప్రధానంగా అందరి దృష్టీ నెలకొందని చెప్పాలి. ఏపీ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వైరల్ గా మారాయి. ఇక తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ లోక్ సభ స్థానంపైనే చర్చ జరుగుతుంది!

అవును... తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ లోక్ సభ స్థానం. ఇక్కడ నుంచి బీజేపీ తరుపున మాధవీలత బరిలోకి దిగారు. ప్రచార కార్యక్రమాల్లోనూ దూకుడు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కొన్ని వివాదాస్పద విషయాలూ తెరపైకి వచ్చాయి. దీంతో... ఇప్పుడు అందరి దృష్టీ మాధవీలత వైపే ఉందని అంటున్నారు.

వాస్తవానికి హైదరాబాద్ లోక్ సభ స్థానం ఎంఐఎం కంచుకోట అనేది తెలిసిన విషయమే. సుమారు 1989 నుంచి ఇది ఎంఐఎం అడ్డాగా ఉంది. ఇక సిట్టింగ్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ అయితే ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు. ఇందులో భాగంగా.. 2004 నుంచి 2019 వరకూ నాలుగు సార్లూ లక్ష నుంచి రెండున్నర లక్షలకు పైగా మెజారిటీ సాధిస్తూ తన హవా కొనసాగించారు.

ఈ క్రమంలో ఐదోసారి బరిలోకి దిగారు. ఈసారి కూడా అసదుద్ధీన్ గెలిస్తే సరికొత్త రికార్డ్ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు. మరోపక్క... మాధవీలత గెలుపుపైనా పలువురు ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రధానంగా ట్రిపుల్ తలాక్ రద్దు వ్యవహారం తమకు ముస్లిం మహిళల ఓట్లను అందించే అవకాశం ఉందని బీజేపీ నమ్ముతుందని అంటున్నారు.

దీంతో... ఈ లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత గెలిస్తే మాత్రం అది కచ్చితంగా సరికొత్త చరిత్ర అవుతుందని.. హైదరాబాద్ లో ఎంఐఎం కి అది చెప్పుకోలేని దెబ్బగా మారుతుందని.. దేశ రాజకీయాల్లో కూడా సరికొత్త చర్చకు తెరలేస్తుందని అంటున్నారు.

ఇదే సమయంలో ఒకవేళ మాధవీలత ఓడిపోయినా.. అసదుద్ధీన్ మెజారిటీని 10 - 20 వేల లోపుకు పడగొట్టినా కూడా అది ఆమె గెలుపుగానే భావించొచ్చనే చర్చా తెరపైకి వచ్చింది. ఇది తెలంగాణలోనే కాదు.. దక్షిణాదిలోనే బీజేపీకి సరికొత్త బలాన్ని తెచ్చి పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాకాని పక్షంలో... ఎన్ని జాతీయ పార్టీలు వచ్చినా హైదరాబాద్ స్థానం రీజనల్ పార్టీదే అని ఒవైసీ నిరూపించినట్లవుతుందని చెబుతున్నారు.