Begin typing your search above and press return to search.

కేటీఆర్ లాజిక్ తో ప్లస్ కంటే మైనస్సే ఎక్కువ

నోటి మాటతో శత్రువుల్ని పెంచుకోవచ్చు. తుంచుకోవచ్చు. మాట్లాడే నాలుగు మాటలు కాస్తంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.

By:  Tupaki Desk   |   4 May 2024 4:45 AM GMT
కేటీఆర్ లాజిక్ తో ప్లస్ కంటే మైనస్సే ఎక్కువ
X

నోటి మాటతో శత్రువుల్ని పెంచుకోవచ్చు. తుంచుకోవచ్చు. మాట్లాడే నాలుగు మాటలు కాస్తంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతున్నారంటే చాలు.. గులాబీ నేతలు దడుచుకుంటున్న పరిస్థితి. ఆయన చెప్పే మాటలు రివర్సు గేరులో పార్టీకి నష్టాన్ని చేకూరుస్తున్న పరిస్థితి. అధికారం చేతిలో ఉన్న వేళలో తాను చెప్పిన మాటలకు.. తాజాగా చెబుతున్న మాటకలు ఏ మాత్రం పొంతన లేకపోవటం ఒక ఎత్తు అయితే.. తాజాగా వినిపిస్తున్న వాదనలో లాజిక్ మిస్ అవుతున్న వైనం పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పాలి.

తెలంగాణ పగ్గాలు తమ చేతిలో ఉన్న వేళలో.. తాము అధికారంలో ఉన్నామని.. కాబట్టి తమకు ఓటు వేస్తే.. ప్రజలకు మేలు జరుగుతుందని.. అందుకు భిన్నంగా విపక్షాలకు ఓటేస్తే.. ఆ ఓటు మోరీలో వేసినట్లేనని వ్యాఖ్యలు చేసేవారు. అధికారంలో తాము ఉన్న నేపథ్యంలో తమకు ఎంపీ సీట్లను ఇస్తే.. కేంద్రం మెడలు వంచి తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతామనే వాదనను తరచూ వినిపించేవారు.

అప్పట్లో ఆయన వాదనలో అంతో ఇంతో నిజమని అనుకునే పరిస్థితి. విపక్షాలకు ఓటు వేస్తే చెల్లని కాసుగా మారుతుందన్న మాటను పదే పదే చెప్పేవారు. తాను గతంలో చెప్పిన మాటకు భిన్నంగా చెబుతున్న మాటలు ఆకట్టుకునేలా లేవంటున్నారు. తాజాగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఈసారి ఎంపీ ఎన్నికల్లో తమకు పది నుంచి పన్నెండు ఎంపీలను ఇస్తే మళ్లీ కేసీఆర్ శకం స్టార్ట్ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

కేటీఆర్ మాటలే నిజమని అనుకుందాం. బీఆర్ఎస్ కు 10-12 సీట్లు వచ్చాయనే అనుకుందాం. కేసీఆర్ శకం ఎలా షురూ వుతుంది? అంటే.. ఎంపీ ఎన్నికల్లో10-12 సీట్లను సొంతం చేసుకున్నంతనే.. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్నితమ పార్టీలో చేర్చుకోవటం ద్వారా.. రేవంత్ ప్రభుత్వాన్ని కూలదోయాలన్నదే ఆలోచనగా చెప్పాలి. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేశారంటూ వారిపై తీవ్రమైన చర్యలతో పాటు.. ఘాటు విమర్శలు చేసిన కేటీఆర్.. ఈరోజు బహిరంగంగా.. వేలాది మంది ముందు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడొట్టాలన్న మాటను చెప్పేయటం దేనికి నిదర్శనం? ప్రతిపక్షంగా ప్రజా సమస్యల మీదా.. వారి హక్కుల మీద పోరాడతామని చెప్పే బదులు.. అర్జెంట్ గా తమ చేతికి అధికారం వచ్చేయాలన్నట్లుగా మాటలు ఉండటం వెగటు పుట్టిస్తుందన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారు?

పది.. పన్నెండు సీట్లను తమకు ఇవ్వాలని కోరుతున్న కేటీఆర్.. తమ చేతిలో పదేళ్లు పవర్ ఉన్నప్పుడు విపక్షాలకు ఓటేయొద్దని లాజిక్ చెప్పినప్పుడు.. ఇప్పుడు అదే లాజిక్ వర్కువుట్ అవుతుంది కదా? తమ చేతిలో అధికారం ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా మాట్లాడే కేటీఆర్ మాటలు పార్టీకి లాభం కంటే నష్టాన్నే కలుగజేస్తాయన్న విషయాన్ని గుర్తించాలని కోరుతున్నారు.