Begin typing your search above and press return to search.

టీడీపీ బీజేపీ జనసేన కలయిక క్విడ్ ప్రోకో నా ?

ఇక టీడీపీని బీజేపీ పిలిచిందని, తాము జాతీయ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంగీకరించామని టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 May 2024 1:30 PM GMT
టీడీపీ బీజేపీ జనసేన కలయిక క్విడ్ ప్రోకో నా ?
X

మూడు పార్టీలు కలసి కూటమి కట్టాయి. ఇది కొత్త కాదు వింత అంత కంటే కాదు 2014లోనూ తెలుగుదేశం, బీజేపీ జనసేన కూటమి కట్టాయి. ఆనాడు ఫలితాలు సానుకూలంగా రావడంతోనే ఈసారి కూడా కూటమిగా ఏర్పడ్డాయి అని విశ్లేషిస్తున్నారు.

అంటే గతంలో హిట్ అయిన కాంబోని రిపీట్ చేసినట్లు అన్న మాట. ఈ కాంబో సెట్ చేసింది నేను అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఒక తెలుగు చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేమే ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలను తీర్చడం కోసం ఎన్డీయేలోకి టీడీపీని ఆహ్వానించామని చెప్పారు.

ఇక టీడీపీని బీజేపీ పిలిచిందని, తాము జాతీయ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంగీకరించామని టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే కూటమి కట్టాక మిత్రులు అయ్యాక అంతా ఒక్క మాట ఒక్క బాటలో నడవాలి కదా. మధ్యలో ఎందుకు తేడాలు కనిపిస్తున్నాయన్నది చర్చ.

ఉదాహరణకు ఉమ్మడి మ్యానిఫేస్టో అని కూటమి పెద్దలు రిలీజ్ చేస్తే అందులో మోడీ ఫోటో ఎందుకు మిస్ అయింది అన్నది ఇపుడు పెద్ద ఎత్తున సాగుతున్న చర్చ. బీజేపీ ఎందుకు దూరం పాటించింది అన్నది కూడా చూడాలి. దీని కంటే ముందు పొత్తులు మార్చి మొదటి వారంలో కుదిరాక కూటమి నేతలు అంతా సూపర్ సిక్స్ పధకాల పేరు చెప్పి ఇంటింటికీ కరపత్రాలు ముద్రించి అందించారు. అందులో నరేంద్ర మోడీ పవన్ చంద్రబాబు ఫోటోలు ఉన్నాయి.

అది కాస్తా ఎన్నికల మ్యానిఫేస్టో దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇలా జరిగింది. దీంతో అసలు ఏమి జరుగుతోంది. ఈ కూటమిలో ఉండడం బీజేపీకి ఇష్టం లేదా అన్న చర్చ నడుస్తోంది. బీజేపీకి ఏకంగా పది అసెంబ్లీ సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఇచ్చారు. పొత్తులలో చూస్తే ఇవి చాలా ఎక్కువ సీట్లు అనే అంటున్నారు.

ఈ సీట్లను తక్కువ చేసి చూడడం లేదు. ఏపీలో బీజేపీకి నోటా కంటే ఓట్లు తక్కువగా వచ్చాయి. అలాంటి పార్టీకి ఇన్ని సీట్లు ఇవ్వడం అంటే బీజేపీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. మరి అంతలా ప్రయారిటీ ఇచ్చినా బీజేపీ ఎందుకు ఎన్నికల మ్యానిఫేస్టోకు దూరం జరిగింది అన్నది చర్చకు వస్తున్న విషయం.

కూటమి ఉమ్మడి మ్యానిఫేస్టోలో మోడీ ఫోటో వేసుకోవడానికి బీజేపీ ఒప్పుకోలేదు అని ప్రచారం సాగుతోంది. అలా ఎందుకు చేస్తున్నారు. ఈ పొత్తు ఇష్టం లేదా అన్నది ప్రశ్నగా ముందుకు వస్తోంది. కేవలం ఎంపీ సీట్ల కోసమే బీజేపీ ఈ కూటమిలో కలిసింది అని అంటున్నారు.

అది కూడా బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధించాలన్న లక్ష్యం పెట్టుకున్న తరువాతనే ఏపీలో టీడీపీ ప్రతిపాదనలకు అంగీకరించింది అని అంటున్నారు. ఏపీలో పరిస్థితి చూస్తే బీజేపీ ఒంటరిగా పోటీ చేయవచ్చు. ఆలా చేస్తే బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ వచ్చినా ఏపీలో పాతిక ఎంపీ సీట్లూ దక్కుతాయి. వైసీపీ టీడీపీ ఎటూ బీజేపీకే మద్దతు ఇస్తూ వస్తున్నాయి కాబట్టి ఆ బెంగ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

కానీ బీజేపీకి తన సొంత ఎంపీలు కావాలి. బీజేపీ టికెట్ మీద గెలిచిన ఎంపీలు ఉండాలి. పైగా ఒక బిగ్ నంబర్ ని టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. అందుకోసమే మనసులో ఇష్టం లేకపోయినా కూటమితో జట్టు కట్టింది అని అంటున్నారు. అంటే ఇష్టం లేని పొత్తు అని ఒక్క మాటలో చెప్పుకోవాలి అన్న మాట.

ఇలాంటి పొత్తుల ఫలితాలు ఇలాగే ఉంటాయని అంటున్నారు. ఏపీని లైట్ తీసుకుంటూ మ్యానిఫేస్టోకి దూరం జరుగుతూ ప్రచారాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తూ బీజేపీ కూటమికి షాకుల మీద షాకులు ఇచ్చేస్తోంది. అయితే ఇదంతా ఎలక్షన్ క్విడ్ ప్రోకో లో భాగం అని అంటున్నారు. అంటే నీకింత నాకింత లెక్క అన్న మాట. బీజేపీకి ఇంత అని కూటమి సీట్లు ఇచ్చింది. మరి బీజేపీ కూటమిలో పెద్దన్న టీడీపీకి ఏమి ఇచ్చి ఉంటుంది అన్నదే రానున్న పది రోజులలో తేలనున్న విషయం. ఏది ఏమైనా ఇప్పటిదాకా ఆర్ధిక లావాదేవీలలో క్విడ్ ప్రోకోలను చూశారు అంతా. కానీ ఎలక్షన్ క్విడ్ ప్రోకోలు ఇలా ఉంటాయా అని ఆలోచిస్తున్నారుట. ఈ విధంగా అయితే ప్రచారం మాత్రం సాగుతోంది మరి.