Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు దిమ్మ తిరిగే సవాలు విసిరిన బండి!

అక్కడితో ఆగని ఆయన.. కేసీఆర్ కు మరో సవాలు విసురుతున్నారు.

By:  Tupaki Desk   |   11 May 2024 4:33 AM GMT
కేసీఆర్ కు దిమ్మ తిరిగే సవాలు విసిరిన బండి!
X

సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ భారీ సవాలును విసిరారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన సూటిగా విసిరిన ఛాలెంజ్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన.. గులాబీ బాస్ కేసీఆర్ కు సూటి సవాలును విసురుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుస్తారన్న ధీమాను కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారని.. ఒకవేళ వినోద్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ విసురుతున్నారు బండి సంజయ్.

అక్కడితో ఆగని ఆయన.. కేసీఆర్ కు మరో సవాలు విసురుతున్నారు. ఒకవేళ తాను ఎన్నికల్లో గెలిస్తే.. గులాబీ బాస్ రాజకీయ సన్యాయసం తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. సిరిసిల్లలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని.. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్.. కేటీఆర్ లు ఎప్పుడూ నేతన్నల సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడింది లేదని ఫైర్ అయ్యారు.

సిరిసిల్ల నేతన్నల బతుకులు ఆగం కావటానికి కేటీఆర్.. కేసీఆర్ లే కారణమన్నారు. వారికి ఇవ్వాల్సిన రూ.270 కోట్ల బకాయిల్ని ఇవ్వటంతో పాటు.. యాభై శాతం విద్యుత్.. తదితర సబ్సిడీలు ఇచ్చి ఉంటే వారి బతుకులు బాగు అయ్యేవని ఆయన చెబుతున్నారు. గతంలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. కలెక్టరేట్ లో కుర్చీలు.. బెంచీలు కూడా ఇవ్వలేదన్న బండి.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్రం డీపీఆర్ లు పంపమని అడిగితే.. కేసీఆర్ ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు.

కాళేశ్వరం డీపీఆర్ లు పంపితే.. వారి అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే పంపలేదని ఆరోపణలు చేశారు. తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని.. దీనికి సంబంధించిన చర్చకుతాను సిద్ధమన్న ఆయన.. తనను ఓడించేందుకు ముస్లింలు ఒక్కటి కావాలని కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించిన ఆయన.. తాను హిందూ సమాజం కోసమే పని చేస్తానని పేర్కొన్నారు. 80 శాతం హిందువులే తనను గెలిపిస్తారన్న బండి మాటలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ కు బండి విసిరిన సవాలుకు ఆయన స్పందించే ధైర్యం చేస్తారా? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.