Begin typing your search above and press return to search.

ఏపీలో క్యాంప్ రాజకీయాలకు తెర లేస్తోందా ?

ఎవరు గెలిచినా బొటా బొటీ అంటున్నారు. మరో సందర్భంలో చూస్తే హంగ్ కూడా రావచ్చు అంటున్నారు

By:  Tupaki Desk   |   17 May 2024 5:38 PM GMT
ఏపీలో క్యాంప్ రాజకీయాలకు తెర లేస్తోందా ?
X

ఎవరు గెలిచినా బొటా బొటీ అంటున్నారు. మరో సందర్భంలో చూస్తే హంగ్ కూడా రావచ్చు అంటున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలలో అలజడి రేగుతోంది. పేరుకు బయటకు గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు కానీ మెజారిటీ సీట్ల మీద నంబర్ మీద డౌట్లు అలాగే ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఈసారి ప్రతీ సీటులోనూ హోరా హోరీ పోరు సాగింది.

ఎవరు గెలిచినా తక్కువ ఓట్లతోనే అని అంటున్నారు. అంతే కాదు చివరి ఓటు కూడా ఫలితాన్ని తిరగరాస్తుందని అంటున్నారు. దాంతో కౌంటింగ్ మీద అంతా దృష్టిని కేంద్రీకరించారు. మరో వైపు చూస్తే కౌంటింగ్ రోజున పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగుతాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హోం శాఖను అలెర్ట్ చేయడంతో ఏపీలో కేంద్ర భద్రతా దళాలను ఏకంగా జూన్ 19 దాకా పొడిగించిన నేపధ్యం కనిపిస్తోంది.

దీనిని బట్టి చూస్తే పోలింగ్ అనంతరం ఘటనలు ఒక ఎత్తు అయితే కౌంటింగ్ తరువాతనే అసలు సినిమా ఉందని అంటున్నారు. ఈసారి ఓటమిని అంగీకరించడానికి ఏ రాజకీయ పక్షమూ అంగీకరించే పరిస్థితి లేకపోవడం కూడా ఇందుకు కారణం అని అంటున్నారు. ఓడిన వారు కసిగా ఉంటారు. దాంతో ఏమైనా జరగవచ్చు అన్నదే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేసిన విషయం అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే బొటా బొటీ మెజారిటీలు వచ్చినా కూడా ఆ పార్టీని గద్దెనెక్కిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. సామ దాన భేద దండోపాయాలతో తమ వైపునకు తిప్పుకునే కార్యక్రమానికి కూడా తెర లేపుతారా అన్న చర్చ నడుస్తోంది. ఏపీలో ఇలాంటివి కొత్త కాదు, 1984, 1995లో వెన్నుపోటు రాజకీయాల వల్ల రెండు ప్రభుత్వాలు కుప్ప కూలిపోయాయి.

ఇక దేశంలో ఇటీవల కాలంలో ఆ తరహా కల్చర్ కూడా ఎక్కువగా ఉంది. దాంతో కర్నాటకలో ఒక వైపు ఫలితాలు వస్తూండగా మరో వైపు తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించడంలో కాంగ్రెస్ జేడీఎస్ పోటీ పడ్డాయి. తీరా ఫలితాలు వచ్చిన తరువాత భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలవడంతో సరిపోయింది.

ఇక తెలంగాణాలో కూడా చూస్తే క్యాంప్ రాజకీయాలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పూర్తి సన్నాహాల్లో ఉంది. అయితే హంగ్ బెడద లేకుండా మంచి మెజారిటీతోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కధ సుఖాంతం అయింది. మరి ఏపీలో ఏమి జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది. బొటా బొటీ మెజారిటీలు వచ్చినా లేక హంగ్ వచ్చినా కూడా అనూహ్య పరిణామాలు సంభవించినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు.

అధికారం నిలబెట్టుకోవడానికి ఒక పార్టీ అధికారం దక్కించుకోవడానికి మరో పార్టీ లైఫ్ అండ్ డెత్ గా పోరాడుతున్న అతి భీకర పోరు ఏపీలో ఉంది. దాంతో ఎవరూ తగ్గేదే లే అన్నట్లుగా ఉన్నారు. మరి క్యాంప్ రాజకీయాల్లో ఒక పార్టీ ఆరితేరిపోయి ఉంది అని అంటున్నారు. రెండవ పార్టీ కూడా పరిస్థితిని బట్టి అప్పటికపుడు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఏపీలో కౌంటింగ్ వేళ ఏదో ఒక పార్టీ వైపుగా భారీ వేవ్ వీస్తే ఏమో కానీ బొటా బొటీ వస్తే మాత్రం ఎవరూ ఊహించని పరిణామాలు జరుగుతాయని అంతా అంచనా కడుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.