Begin typing your search above and press return to search.

చిన్న కారణం.. జరిగింది పెద్ద దారుణం!

చిన్నచిన్న కారణాలకే మనుషుల ప్రాణాలు తీసేవారు ఎక్కువైపోయారు.

By:  Tupaki Desk   |   4 May 2024 11:03 AM GMT
చిన్న కారణం.. జరిగింది పెద్ద దారుణం!
X

చిన్నచిన్న కారణాలకే మనుషుల ప్రాణాలు తీసేవారు ఎక్కువైపోయారు. మాటలతో సర్దిచెప్పుకునేవాటికి కూడా హత్యలు చేసేవరకు వెళ్లిపోతున్నారు. తద్వారా అమాయకుల ప్రాణాలు తీయడంతోపాటు వారు కూడా జైలుపాలవుతున్నారు. ఇప్పుడు ఇలాంటి చిన్న కారణంతోనే ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. సైబరాబాద్‌ లో రాయదుర్గం పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌ లో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఇనుప రాడ్డుతో హోటల్‌ లోనికి ప్రవేశించి ఆ హోటల్‌ యజమానిని అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. ఇనుపరాడ్డుతో విచక్షణారహితంగా తలపై కొట్టడంతో హోటల్‌ యజమాని మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న కథనం ప్రకారం.. యూసుఫ్‌ గూడకు చెందిన చెల్లూరి శ్రీనివాస్‌(54) కొండాపూర్‌ వైట్‌ ఫీల్డ్స్‌ విల్లాస్‌ లో నివసిస్తున్నాడు. శ్రీనివాస్‌ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌ లో తన కుమారుడు కేశవ్‌ వినయ్‌ (28)తో కలిసి సీఎస్‌ డెలాయిట్‌ ఇన్‌ పేరుతో హోటల్‌ నడుపుతున్నారు. ఈ క్రమంలో హోటల్‌ సరుకులను నిల్వ చేయడం కోసం హోటల్‌ వెనుక ఒక గదిని స్టోర్‌ రూమ్‌ కోసం అద్దెకు తీసుకున్నారు.

ఈ క్రమంలో ఏడాది క్రితం స్టోర్‌ రూమ్‌ ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీని ఆపి సరుకులు దించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆటో ట్రాలీ వల్ల పార్కింగ్‌ కు ఇబ్బంది అవుతుందని.. రాకపోకలకు సమస్య అవుతోందని హోటల్‌ పక్కింట్లో ఉండే ఉపేందర్‌ (35) హోటల్‌ యజమాని శ్రీనివాస్‌ తో గొడవ పడ్డాడు. దీంతో స్థానికులు ఉపేందర్‌ ను వారించారు.

దీంతో అప్పటి నుంచి శ్రీనివాస్‌ పై ఉపేందర్‌ కక్ష కట్టాడు. ఈ క్రమంలో తాజాగా మే 3న సాయంత్రం ఇనుప రాడ్డుతో హోటల్‌ లోకి ప్రవేశించిన ఉపేందర్‌ .. ఒక్కసారిగా హోటల్‌ యజమాని శ్రీనివాస్‌ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న శ్రీనివాస్‌ కుమారుడు కేశవ్, హోటల్‌ సిబ్బంది మహేందర్‌ ను అడ్డుకుని శ్రీనివాస్‌ ను కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తగాయాలు కావడంతో ఆయన మరణించాడు.

కుమారుడు కేశవ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ఉపేందర్‌ ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా నిందితుడు ఉపేందర్‌ ఎంబీఏ చేసి ఖాళీగా ఉన్నాడు. ఉద్యోగం కూడా లేదని సమాచారం. ఇంకా వివాహం కాలేదని.. ఈ విషయంలో కుటుంబ సభ్యులతోనూ గొడవ పడుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిన్న కారణంతో హోటల్‌ యజమానిని అంతమొందించాడు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.